ఆకాశం సైతం హద్దు కాదు | PM Modi Recalls Trinidad and Tobago PM Kamla Persad-Bissessar Ancestral Ties | Sakshi
Sakshi News home page

ఆకాశం సైతం హద్దు కాదు

Jul 5 2025 4:47 AM | Updated on Jul 5 2025 9:07 AM

 PM Modi Recalls Trinidad and Tobago PM Kamla Persad-Bissessar Ancestral Ties

త్వరలో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ 

దేశం నేడు అవకాశాల గనిగా మారింది 

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: భారత్‌ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి రంగాల్లో ఇండియా శరవేగంగా దూసుకెళ్తోందని, అవి సరికొత్త గ్రోత్‌ ఇంజన్లుగా మారాయని వెల్లడించారు.

 ఆయన స్థానిక కాలమానం ప్రకారం గురువారం కరీబియన్‌ దేశమైన ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశంలోని కౌవా పట్టణంలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రసంగించారు. ఇండియా నేడు అవకాశాల గనిగా మారిందని, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. నవ భారతదేశానికి ఆకాశం సైతం హద్దు కాదని వ్యాఖ్యానించారు. 

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలోని భారతీయులు వారి సొంత భూమిని వదిలేసి వచ్చినప్పటికీ భారతీయ ఆత్మను మాత్రం వదులుకోలేని చెప్పారు. గంగా, యమున నుంచి దూరంగా వచ్చారు గానీ రామాయణాన్ని హృదయంలోనే నిలుపుకున్నారని ప్రశంసించారు. ప్రవాస భారతీయులు కేవలం వలసదారులు కాదని.. గొప్ప నాగరికతకు దూతలు అని తెలి పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...  

‘‘ప్రవాస భారతీయుల సేవలు ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి. సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా వారు ఎంతో సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రవాస భారతీయుల ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయోధ్య రామమందిర నమూనా, సరయూ నది జలాలను, మహాకుంభమేళా జరిగిన త్రివేణి సంగమం నీటిని ఇక్కడికి నాతోపాటు తీసుకొచ్చా. అందుకు ఎంతగానో గర్విస్తున్నా. ఈ పవిత్ర జలా లను ఇక్కడి గంగాధారలో చల్లాలని ప్రధానమంత్రి కమలకు విజ్ఞప్తి చేశా. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రజలకు ఇదొక ఆశీర్వచనం అవుతుంది.  

భారత్‌ ప్రగతికి యువతే చోదక శక్తి  
పేదల అభివృద్ధి, సాధికారతకు పెద్దపీట వేయడం ద్వారా పేదరికాన్ని ఓడించవచ్చని భారత్‌ నిరూపించింది. పేదరికం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించవచ్చన్న విశ్వాసాన్ని పెంచాం. ఇండియా ప్రగతికి శక్తిసామర్థ్యాలు కలిగిన యువతే చోదక శక్తిగా నిలుస్తోంది. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ ఇండియాలోనే ఉంది. ఇందులో సగం స్టార్టప్‌లకు మహిళలే డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. 120 స్టార్టప్‌లు యూనికార్న్‌ స్థాయికి ఎదిగాయి. 

ప్రపంచంలోని మొత్త యూపీఐ చెల్లింపుల్లో 50 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయి. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. గుడ్‌ మారి్నంగ్‌ అని మెసేజ్‌ పంపించుకున్నంత సులువుగా డబ్బులు పంపించుకోవచ్చు. వెస్టిండీస్‌ బౌలింగ్‌ కంటే కూడా ఇది స్పీడ్‌గా ఉంటుందని నేను ప్రామిస్‌ చేస్తున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.    

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వద్దు
పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఉగ్రవాదానికి మానవాళికి శత్రువుగా మారిందని, దానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదిరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. 

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశమని వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరాటానికి ఈ దేశం మద్దతిస్తోందని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద రిపబ్లిక్‌ ఆఫ్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో’తో నరేంద్ర మోదీని సత్కరించింది.

బిహార్‌ వారసత్వం గర్వకారణం  
ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు ఇండియాలోని బిహార్‌ రాష్ట్రంతో చక్కటి అనుబంధం ఉందని నరేంద్ర మోదీ చెప్పారు. బిహార్‌ వారసత్వం భారతదేశానికి, ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ఇక్కడున్న చాలామంది భారత సంతతి ప్రజల పూర్వీకులు బిహార్‌ నుంచి వచ్చినవారేనని తెలిపారు. బిహార్‌కు ఘనమైన వారసత్వం ఉందని పేర్కొన్నారు. 

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధానమంత్రి కమలా పెర్సాద్‌ బిసెసార్‌ పూర్వీకులు సైతం బిహార్‌కు చెందినవారేనని చెప్పారు. ఆమె బిహార్‌ను సందర్శించారని, భారతీయులు ఆమెను ‘బిహార్‌ బిడ్డ’గా పిలుస్తుంటారని అన్నారు.  భారత్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. బిహార్‌కు చెందిన భోజ్‌పురి భాషను ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో కూడా చాలామంది మాట్లాడుతుంటారని వివరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

మోదీకి సంప్రదాయ స్వాగతం  
ఘనా నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. దేశ ప్రధానమంత్రి కమలా పెర్సాద్‌ బిసెసార్‌తోపాటు మంత్రులు, అధికారులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. భారత సంతతికి చెందిన కమలా పెర్సాద్‌ బిసెసార్‌ ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ చీర ధరించారు. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీతోపాటు ఆమె పాల్గొన్నారు.

 ‘బిహార్‌ కీ బేటీ’ అంటూ కమలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రాసిన పుస్తకంలోని ‘ఆంఖ్‌ కా ధన్యా చే’ పద్యాన్ని కమల ఆలపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. భారత్‌ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాన్ని ఆమెకు మోదీ బహూకరించారు. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా కమలా పెర్సాద్‌ బిసెసార్‌ రికార్డుకెక్కారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement