Pakistan: ఉగ్రవాదం వ్యతిరేక చట్టంలో బుక్కైన ఇమ్రాన్‌ ఖాన్‌.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!

Pakistan Imran Khan Faces Arrest After Booked Under Terror Act - Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీటీఐ అధినేత, పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌(69).. ఉగ్రవాద చట్టంలో బుక్కయ్యారు. దీంతో ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

శనివారం ఇస్లామాబాద్‌ ర్యాలీలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. పోలీసింగ్‌, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఆ వ్యవస్థలను బెదిరించేవిగా ఉన్నాయని పేర్కొంటూ పాక్‌ యాంటీ-టెర్రరిజం యాక్ట్‌ సెక్షన్‌ -7 ప్రకారం కేసు నమోదు చేశారు ఇస్లామాబాద్‌ మార్గల్లా పోలీసులు. 

ఆదివారం పాక్‌ మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని, ఆయనపై కేసు నమోదు అయ్యే ఛాన్స్‌ ఉందని వ్యాఖ్యానించారు. ఆ కొద్దిగంటలకే మాజీ ప్రధానిపై కేసు నమోదు అయ్యింది. ఖాన్ తన ప్రసంగంలో ‘‘అత్యున్నత పోలీసు అధికారులను, గౌరవనీయమైన మహిళా అదనపు సెషన్స్ జడ్జిని, పాక్‌ ఎన్నికల సంఘాన్ని భయభ్రాంతులకు గురిచేశారని, బెదిరించారని’’ అని మార్గల్లా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. పాక్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ సంస్థ.. స్థానిక ఛానెళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముందు నుంచి చెప్తున్నప్పటికీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్‌సాఫ్‌ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ రెచ్చగొట్టే ప్రసంగాలను, ప్రకటనలను ప్రస్తారం చేస్తున్నాయని మందలించింది. అంతేకాదు.. కావాలంటే ఆలస్యంగా వాటిని ప్రసారం చేసుకోవచ్చని సూచించింది. 

అధికారంలో నియంతలు
ఇదిలా ఉంటే.. తనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు కావడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ను బ్లాక్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. న్యాయవ్యవస్థ సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోవైపు పీటీఐ సైతం నియంతల రాజ్యమంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ను అడ్డుకుని తీరతామని పేర్కొంటూ.. నిరసనలకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: పాక్‌ గానకోకిల నయ్యారా నూర్‌ కన్నుమూత

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top