టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఏప్రిల్ 15న ఇరాన్ చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగేలా చేయడానికి ఇరాన్‌లో మునీర్ ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కూడా సంకేతాలు ఇచ్చారు.
అందుకు సంబంధించే పాక్ ప్రతినిధి బృందంతో మునీర్ ఇరాన్ వెళ్లినట్లు ఆ దేశ సైన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా, మునీర్ ఇరాన్ పర్యటనపై మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఇరాన్ పర్యటన ముగిశాక మునీర్ అమెరికాకు కూడా వెళ్లనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఇరాన్ అణు కార్యక్రమం అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పాకిస్థాన్ అధికారులు భావిస్తున్నారని అల్ జజీరా మీడియా చెప్పింది. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్ మునీర్ ఇప్పటికే వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సందేశాన్ని కూడా తీసుకెళ్లి మునీర్ అమెరికాకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో లేదా ఇతర దేశంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ అణు శుద్ధి ప్రక్రియను ఎంతకాలం ఆపాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు ఐదేళ్లు ఆపాలని, మరికొందరు 20 ఏళ్లు ఆపాలని చెబుతున్నారు. ఇది ఇరు దేశాల మధ‍్య ఉన‍్న ప్రధాన విభేదం. మరొక ప్రధాన అంశం ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వ. ఈ నిల్వను మరో దేశానికి తరలించడం లేదా శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి పలు మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.
ఆ నిల్వతో 10 అణ్వాయుధాలు చేయొచ్చు
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం.. ఇప్పటికే ఇరాన్ 60% స్వచ్ఛత వరకు 440.9 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వను శుద్ధి చేసింది. ఇది 90% ఆయుధ-స్థాయి స్వచ్ఛతకు చేరడానికి ఒక చిన్న అడుగు దూరంలో ఉంది.
ఒకవేళ ఇరాన్ తన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటే, ఆ నిల్వతో 10 అణ్వాయుధాల వరకు తయారు చేయగలదని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఏపీకి ఇచ్చిన ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఐఏఈఏ మార్గదర్శకాల ప్రకారం.. ఇంత అధికంగా శుద్ధి చేసిన అణు పదార్థాన్ని సాధారణంగా ప్రతి నెల తనిఖీ చేయాలి.
ఈ పరిణామాల మధ్య, మునీర్ ఇరాన్ పర్యటన తరువాత వాషింగ్టన్ వెళ్లే అవకాశం ఉంది. ఇది మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగమని పాక్ భద్రతా వర్గాలు తెలిపాయి. బుధవారం అరాఘ్చీ టెహ్రాన్‌లో మునీర్‌ను స్వాగతిస్తూ, చర్చలకు సహకరించిన పాకిస్థాన్ పాత్రను ప్రశంసించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ శాంతి, స్థిరత్వం అంశాలను ప్రస్తావించారు.
ఇస్లామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అందరూ భావించారు. డొనాల‍్డ్ ట్రంప్ హార్మూజ్, ఇరాన్ ఓడ రేవుల దిగ్బంధం చేయించడంతో ఇది సమీప భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల పరిణామాలను దారి తీయవచ్చు.
ఇరాన్ అణు కార్యక్రమం, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చడం, ఇతర "రెడ్ లైన్" అంశాలపై వెనక్కి తగ్గకపోతుండడంతో.. తదుపరి జరిపే ఉన్నత స్థాయి సమావేశమే చివరి ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అన్ని అంశాల్లో వెనకడుగు వేసేలా కనపడడం లేదు. ఇటువైపేమో రెండో దశ చర్చలు జరగకపోయినా, అవి మళ్లీ విఫలమైనా భీకర యుద్ధం తప్పదని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది.


