వైరస్‌లను భోంచేస్తుంది

Organism that eats viruses for lunch found for the first time - Sakshi

వింత సూక్ష్మజీవి ఉనికిని గుర్తించిన సైంటిస్టులు

వాషింగ్టన్‌: వైరస్‌లు. ఈ పేరంటేనే మనకు హడల్‌. కరోనా వంటి పలు రకాల వైరస్‌లు మనకే గాక ఇతర జీవ జాతులకూ ప్రాణాంతకాలు కూడా. అలాంటి వైరస్‌లనే లంచ్‌లోకి నమిలి మింగేసే ఒక వింత జీవి ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నీళ్లలో తమ పరిధిలో ఉన్న నానా రకాల క్లోరో వైరస్‌లనూ అదీ ఇదీ అని లేకుండా ఇది భారీ సంఖ్యలో తినేస్తుందట! ఈ సూక్ష్మ జీవిని యూనివర్సిటీ ఆఫ్‌ నెబ్రాస్కా–లింకన్స్‌ పరిశోధకులు తొలిసారిగా కనిపెట్టారు. దీన్ని స్వచ్ఛమైన నీటిని కలుషితం చేసే హాల్టేరియా అనే సూక్ష్మజీవుల్లో ఓ జాతికి చెందినదిగా గుర్తించారు. ఇది మరో భోజనంతో పని లేకుండా కేవలం వైరస్‌లను మాత్రమే తిని సుష్టుగా పెరుగుతుందని, తమ సంతతినీ వృద్ధి చేసుకుంటోందని వారి పరిశోధనల్లో తేలడం విశేషం.

పరిశోధనలో భాగంగా ఓ మంచినీటి కొలను నుంచి నీటిని సేకరించారు. అందులోకి క్లోరో వైరస్‌లను వదిలారు. కొంతకాలానికి వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండటం వారిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మరో రకం సూక్ష్మజీవులు పరిమాణంలో మామూలు కంటే ఏకంగా 15 రెట్లు పెరిగిపోతున్న వైనమూ కంటబడింది. వాటిని హాల్టేరియాగా గుర్తించారు. తినడానికి మరేమీ అందుబాటులో లేకపోవడంతో అవి హాయిగా క్లోరో వైరస్‌లనే తిని అరాయించుకుని అంతలా పెరిగాయట! ఈ పరిశోధన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడెమీ సైన్సెస్‌’లో పబ్లిషైంది. దీని ఫలితాలు ఆహారచక్రం గురించిన మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తాయని పరిశోధన బృందానికి చెందిన డాక్టర్‌ డిలాంగ్‌ అంటున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top