breaking news
Microorganism
-
వైరస్‌లను భోంచేస్తుంది
వాషింగ్టన్: వైరస్లు. ఈ పేరంటేనే మనకు హడల్. కరోనా వంటి పలు రకాల వైరస్లు మనకే గాక ఇతర జీవ జాతులకూ ప్రాణాంతకాలు కూడా. అలాంటి వైరస్‌లనే లంచ్‌లోకి నమిలి మింగేసే ఒక వింత జీవి ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నీళ్లలో తమ పరిధిలో ఉన్న నానా రకాల క్లోరో వైరస్‌లనూ అదీ ఇదీ అని లేకుండా ఇది భారీ సంఖ్యలో తినేస్తుందట! ఈ సూక్ష్మ జీవిని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా–లింకన్స్ పరిశోధకులు తొలిసారిగా కనిపెట్టారు. దీన్ని స్వచ్ఛమైన నీటిని కలుషితం చేసే హాల్టేరియా అనే సూక్ష్మజీవుల్లో ఓ జాతికి చెందినదిగా గుర్తించారు. ఇది మరో భోజనంతో పని లేకుండా కేవలం వైరస్‌లను మాత్రమే తిని సుష్టుగా పెరుగుతుందని, తమ సంతతినీ వృద్ధి చేసుకుంటోందని వారి పరిశోధనల్లో తేలడం విశేషం. పరిశోధనలో భాగంగా ఓ మంచినీటి కొలను నుంచి నీటిని సేకరించారు. అందులోకి క్లోరో వైరస్‌లను వదిలారు. కొంతకాలానికి వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండటం వారిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మరో రకం సూక్ష్మజీవులు పరిమాణంలో మామూలు కంటే ఏకంగా 15 రెట్లు పెరిగిపోతున్న వైనమూ కంటబడింది. వాటిని హాల్టేరియాగా గుర్తించారు. తినడానికి మరేమీ అందుబాటులో లేకపోవడంతో అవి హాయిగా క్లోరో వైరస్‌లనే తిని అరాయించుకుని అంతలా పెరిగాయట! ఈ పరిశోధన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడెమీ సైన్సెస్’లో పబ్లిషైంది. దీని ఫలితాలు ఆహారచక్రం గురించిన మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తాయని పరిశోధన బృందానికి చెందిన డాక్టర్ డిలాంగ్ అంటున్నారు. -
వయసును సూక్ష్మజీవి శాసిస్తుందా?
మనిషి జీవితాన్ని కంటికి కనబడని సూక్ష్మజీవి నిర్దే శిస్తుందా? ఆయుఃప్రమాణాన్ని అంతర్గత రోగనిరోధకత ప్రభావితం చేస్తుందా? మైక్రోబ్స్ బారిన పడకుండా ఉంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావా? అవునంటోంది తాజా పరిశోధన.. ఆ కథేంటో చూద్దాం! మనిషిలో రోగనిరోధకతకు, వృద్ధాప్యానికి సంబంధం ఉందనేలా నూతన అధ్యయన ఫలితాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ సంస్థ ఐసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన వివరాలు ఆసక్తికలిగించేలా ఉన్నాయి. డ్రోసోఫిలా(ఫ్రూట్‌ఫ్లై) అనే కీటకంపై సంస్థ జరిపిన పరిశోధనల్లో వయసు పెరుగుదలకు సంబంధించిన 70 శాతం జన్యువులకు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా కలిగే ఇమ్యూన్ రెస్పాన్స్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది. జీవి శరీరంలోకి బ్యాక్టీరియా లాంటి పరాయి పదార్ధాలు(యాంటిజెన్స్) ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజమై(ఇమ్యూన్ రెస్పాన్స్) సదరు యాంటిజెన్స్‌ను అడ్డుకుంటుందన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే ఏజింగ్‌ను ప్రేరేపించే జన్యువులు సైతం యాక్టివేట్ అవుతాయని నిరూపితమైంది. రోగనిరోధకత అతి చురుకుదనం(హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ) చూపడం వల్ల నరాలకు డ్యామేజీ కలుగుతుందని మాత్రమే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా డ్రోసోఫిలాపై జరిపిన పరిశోధనతో ఇమ్యూనిటీ, ఏజింగ్ జన్యువులపై ప్రభావం చూపుతుందని తెలిసింది. ‘‘చాలా రోజులుగా ఏజింగ్ జీన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి జీవిలో ఈ జీన్స్ కారణంగా వృద్ధాప్యం సంభవిస్తుంది. మా పరిశోధనలో ఈ జీన్స్‌లో 30 శాతం మాత్రమే సహజసిద్ధంగా ఏజింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటాయని, 70 శాతం ఏజింగ్ జీన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్‌తో యాక్టివేట్ అవుతాయని తెలిసింది.’’అని సీనియర్ సైంటిస్టు డా.ఎడ్వర్డ్ జినిజెర్ చెప్పారు. వయసు ప్రభావిత సమస్యలపై జరిగే మెడికల్ రిసెర్చ్‌లకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు. ఎలా కనుగొన్నారు? తాజాగా జన్మించిన కొన్ని డ్రోసోఫిలా కీటకాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఈగలను బ్యాక్టీరియా చొరబడలేని వాతావరణంలో యాంటీబయాటిక్స్ మధ్య పెంచారు. రెండో గ్రూపును సాధారణ వాతావరణంలో పెంచారు. వీటిలో బ్యాక్టీరియా బారిన పడని ఈగలు 63 రోజులు బతికితే, సహజ వాతావరణంలో బ్యాక్టీరియాకు గురైన ఈగలు 57 రోజులు మాత్రమే బతికాయి. దీంతో ఏజింగ్ జీన్స్‌ను ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రభావితం చేస్తుందని, యాంటీబయాటిక్స్ వాడకం కారణంగా ఏజింగ్ జీన్స్ యాక్టివిటీ మందగించిందని నిర్ధారణకు వచ్చారు. ఈగల్లో 6 రోజుల జీవిత కాలం తేడా అంటే మానవుల్లో సుమారు 20 సంవత్సరాలకు సమానమని పరిశోధనలో పాల్గొన్న మరో సైంటిస్టు డా. అరవింద్ కుమార్ శుక్లా వివరించారు. అలాగే వీటిలో కొన్ని జన్యువులు శరీరాంతర్గత గడియారం(బయలాజికల్ క్లాక్)ను నియంత్రిస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే కచ్ఛితంగా వీటిలో ఏ జీన్స్ పూర్తిగా ఏజింగ్ ప్రక్రియకు కారణమనేది తెలియరాలేదని, దీనిపై మరింత పరిశోధన జరగాలని చెప్పారు. ఇమ్యూనిటీతో పాటు జీవక్రియలు, ఒత్తిడి తదితరాలపై కూడా మైక్రోబయోమె(శరీరంలో నివసించే అన్ని సూక్ష్మక్రిముల మొత్తం జన్యుపదార్థం) ప్రభావితం చేయగలవన్నారు. -
సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు
గ్రూప్స్, తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి జనరల్ సైన్సలో.. జీవ శాస్త్ర అధ్యయనం ఎంతో కీలకం. ఇందులో భాగంగా వివిధ రకాల సూక్ష్మజీవులు.. మానవుడికి, ఇతర జీవులకు ఏవిధంగా తోడ్పడతాయి, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు సంబంధిత అంశాలపై విశ్లేషణ.. మానవుడికి అనేక రకాల సూక్ష్మజీవుల ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, ప్రోటోజోవా వర్గానికి చెందిన కొన్ని జీవులు. ఇందులో కొన్నిటి ద్వారా స్వల్ప స్థాయిలో ప్రభావం కనిపిస్తే.. మరికొన్ని ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధులు అదుపు తప్పి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. 2009 మార్చిలో మెక్సికోలో మొదలైన స్వైన్‌ఫ్లూ ఇప్పుడు దాదాపు 200 దేశాలకు విస్తరించడమే ఇందుకు ఉదాహరణ. అదేవిధంగా ఎబోలా వంటి వ్యాధులు కూడా ఈ విధంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో వైద్య సంసిద్ధత సరిగా లేకపోతే నష్టం తీవ్రంగా ఉండొచ్చు. సూక్ష్మ జీవులను కేవలం వ్యాధిని కలుగజేసే కారకాలుగా మాత్రమే పరిగణించడం సరికాదు. ఎందుకంటే వీటి వల్ల మానవుడికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియా సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనవి బ్యాక్టీరియా. ఇవి కేంద్రకపూర్వ జీవులు, ఏకకణ జీవులు. ఒక నిర్దిష్ట కేంద్రకం, ఇతర కణ భాగాలు లేని పూర్వకణాలు.. కేంద్రకపూర్వ కణాలు (Prokaryotic cells). వీటిలో జన్యు పదార్థం (డీఎన్ఏ) ఏ ఆచ్ఛాదన లేకుండా కణ ద్రవ్యంలో ఉంటుంది. కేంద్రకపూర్వ కణాలతో ఏర్పడతాయి కాబట్టి వీటిని కేంద్రక పూర్వ జీవులు (Prokaryotes) అంటారు. ఇవి పూర్వపరమైన జీవులు. జీవావిర్భావ ప్రారంభంలో పరిణామం చెందాయి. వీటి నుంచి తర్వాతి కాలంలో నిజ కేంద్రక జీవులు పరిణామం చెందాయి. రాబర్ట విట్టేకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవుల వర్గీకరణలో కేంద్రకపూర్వ జీవులన్నింటినీ మొనీరా (Monera) రాజ్యంలో వర్గీకరించారు. బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా అనే రెండు రకాల జీవులను మొనీరా రాజ్యంలో వర్గీకరించారు. సయనో బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియాను పోలిన జీవి. వీటిని అంతకుముందు నీలి-ఆకుపచ్చ శైవలాలు (Blue Green Algae) గా పిలిచేవారు. ప్రారంభంలో వీటిని శైవలాలుగా భావించడమే దీనికి కారణం. తర్వాతి కాలంలో ఇవి శైవలాలు, నిజకేంద్రక జీవులు కాదని గుర్తించి, బ్యాక్టీరియా ఉన్న మొనీరా రాజ్యంలో చేర్చారు. బ్యాక్టీరియా సాధారణంగా రెండు రకాలు. అవి.. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. వీటిల్లో ఆర్కీ బ్యాక్టీరియా అతి పురాతనమైంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం బ్యాక్టీరియా తమ మనుగడను సాగించగలదు. 60 నుంచి 800ఇ ఉష్ణోగ్రత వద్ద ఉన్న సల్ఫర్ ఊటలో సైతం ఇవి జీవిస్తాయి. ఉదాహరణ: థర్మోప్లాస్మా, మెథనో బ్యాక్టీరియా. విభిన్న ఆకారాలు సాధారణంగా బ్యాక్టీరియా అనే పదాన్ని ఉపయోగించినప్పుడు మనం తెలియకుండానే యూ బ్యాక్టీరియాను సంభోధించినట్టు అవుతుంది. ఇవి విభిన్న ఆకారాల్లో ఉంటాయి. అవి.. దండ ఆకార బ్యాక్టీరియం, బాసిల్లస్, వృత్తాకార బ్యాక్టీరియం, కోకస్, కామా ఆకార బ్యాక్టీరియం, విబ్రియో, సర్పిలాకార బ్యాక్టీరియం, స్పైరిల్లం. సాధారణంగా బ్యాక్టీరియం నిర్మాణంలో బాహ్యంగా ఒక కణకవచం ఉంటుంది. ఇది పెప్టిడోగ్లైకాన్/మ్యూరీన్/మ్యాకోపెప్ట్మై అనే పదార్థంతో తయారవుతుంది. కొన్ని బ్యాక్టీరియాల్లో కణ కవచం మందంగా, మరికొన్నింటిలో పల్చగా ఉంటుంది. ఈ రెండు రకాల బ్యాక్టీరియాను కచ్చితంగా నిర్ధారించే ప్రక్రియ/ పరీక్షను హాన్స క్రిస్టియన్ గ్రామ్ రూపొందించారు. ఈ పరీక్ష కణ కవచం మందంగా ఉంటే పాజిటివ్, పల్చగా ఉంటే నెగిటివ్‌గా స్పందిస్తుంది. కాబట్టి బ్యాక్టీరియాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఉదాహరణ: స్ట్రె ప్టోకోకస్ నియోనియే. 2. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: విబ్రియో కలరే. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో కణ కవచం పల్చగా ఉంటుంది. కాబట్టి వీటిలో కణ కవచానికి అదనంగా బాహ్యంగా అవుటర్ మెంబరెన్ (Outer membrane) అనే బాహ్య పొర ఉంటుంది. ఇది కొవ్వు పిండి పదార్థంతో తయారవుతుంది. కాబట్టి దీన్ని ఎల్పీఎస్ (లిపో పాలీ శాఖరైడ్) లేయర్ అంటారు. కణ కవచం తర్వాత లోపలి వైపు కణ ద్రవ్యాన్ని కప్పి ప్లాస్మా త్వచం ఉంటుంది. కణద్రవ్యంలో వృత్తాకార డీఎన్ఏ ప్రధాన జన్యు పదార్థం. నిజకేంద్రక కణాల మాదిరి డీఎన్ఏ కేంద్రకంలో ఉండదు. ఈ రకమైన జన్యు నిర్మాణం, న్యూక్లియామిడ్ లేదా జీనోఫోర్ లేదా బ్యాక్టీరియా క్రోమోజోమ్, రైబో జోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లను నిర్మిస్తాయి. ప్రధాన జన్యు పదార్థానికి అదనంగా కూడా బ్యాక్టీరియా కణద్రవ్యంలో స్వయం ప్రతికృతి చెందే వృత్తాకార డీఎన్ఏ అణువులు ఉంటాయి. వీటిని ప్లాస్మిడ్స అంటారు. వీటి ద్వారా బ్యాక్టీరియాకు అదనపు లక్షణాలు సంభవిస్తాయి. నేడు వివిధ యాంటీబయాటిక్ మందులకు నిరోధకతను అభివృద్ధి చేసుకోవడానికి కారణం ఈ ప్లాస్మిడ్లు. పలు మార్గాల ద్వారా వివిధ మార్గాల ద్వారా బ్యాక్టీరియాలు వ్యాధులను కలుగజేస్తాయి. అవి.. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: క్షయ, నిమోనియ, డిఫ్తీరియా, కోరింత దగ్గు. కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: కలరా, బొట్యులిజం, షిజెల్లోసిస్, టైఫాయిడ్. ధూళి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: టెటానస్ (ధనుర్వాతం), బొట్యులిజం. లైంగికంగా సంక్రమించే వ్యాధులు: సిఫిలిస్, గనేరియా.అధిక శాతం బ్యాక్టీరియాలు మానవుడిలోకి ప్రవేశించి విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణ: కలరా బ్యాక్టీరియా చిన్న పేగులో కలరాజెన్ అనే కలరా టాక్సిన్ను విడుదల చేస్తుంది. సి.హరికృష్ణ సీనియర్ ఫ్యాకల్టీ ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్