G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన | Sakshi
Sakshi News home page

G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన

Published Sat, Sep 9 2023 5:59 AM

No consensus on Delhi Declaration at Sherpa meet as G20 split over Ukraine war - Sakshi

జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్‌) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు.

సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్‌ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి.

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్‌లో భారత్‌ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్‌లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్‌ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్‌ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు చర్చలు జరిపి డిక్లరేషన్‌ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది.

భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్‌
తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్‌ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు.

వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం
చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది.

2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది.

జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్‌ నెట్‌ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్‌ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్‌సహా దేశాలు వాదిస్తు న్నాయి.

2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్‌ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్‌ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరే ట్స్‌లో జరగ బోయే కాప్‌28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది.
    
–సాక్షి నేషనల్‌డెస్క్‌
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement