NEET వివాదం: చైనా మోడల్‌తో ఏ లీకులు ఉండవ్‌! | NEET row: China Gaokao model shows the way to end exam leaks | Sakshi
Sakshi News home page

NEET వివాదం: చైనా మోడల్‌తో ఏ లీకులు ఉండవ్‌!

May 13 2026 11:20 AM | Updated on May 13 2026 12:00 PM

NEET row: China Gaokao model shows the way to end exam leaks

భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్‌ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్‌-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్‌ తెర మీదకు తెచ్చారు. 

భారత్‌లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్‌లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్‌కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన.  

చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్‌ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్‌లపై డ్రాగన్‌ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. 

అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.

ఏంటీ గావ్‌కావో (Gaokao)? 
గావ్‌కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్‌లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.

ఈ ఎంట్రెన్స్‌లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్‌కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..

అందుకే భారత్‌కు అవసరం!
భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్‌ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్‌ను భారత్‌ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. 

చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది.  చైనా మాదిరిగా భారత్‌లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement