ట్రంప్‌ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం

Most Republican Senators vote against impeachment trial for Donald Trump - Sakshi

మెజార్టీ రిపబ్లికన్‌ సెనేటర్ల అభిప్రాయం

డెమొక్రాట్లపై విమర్శలు

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు  ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్‌ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్‌ అనునూయులు హింసకు, హేట్‌ స్పీచ్‌కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. నిజానికి పలుమార్లు డెమొక్రాట్లే నిజమైన విద్వేష ప్రసంగాలివ్వడం, హింసను రెచ్చగొట్టడం చేశారని రిపబ్లికన్‌ సెనేటర్‌ రాండ్‌ పాల్‌ విమర్శించారు. ట్రంప్‌పై తీర్మానం మతిమాలిన చర్య అని  మార్క్‌ రూబియో, లిండ్సే గ్రాహం, టెడ్‌ క్రూజ్‌ అన్నారు. అంతకుముందు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్‌ సెనేటర్లు ఓటు వేశారు.

ఐదుగురు అటువైపే
అభిశంసన తీర్మానంపై సెనేట్లో ఐదుగురు రిపబ్లికన్‌ సెనేటర్లు డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేశారు. మిట్‌ రోమ్నీ, బెన్‌సాసే, సుసాన్‌ కోలిన్స్, లీసా ముర్కోవిస్కీ, పాట్‌ టూమీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానానికి 55 అనుకూల ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ను అభిశంసించాలంటే సెనేట్‌లో మూడింట్‌ రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే డెమొక్రాట్లకు 17 మంది రిపబ్లికన్‌ సెనేటర్ల మద్దతు అవసరం. ఇలాంటి తీర్మానాలు అమెరికా ప్రతిష్టను భంగపరుస్తాయని రిపబ్లికన్‌ సెనేటర్లు వ్యాఖ్యానించారు. అభిశంసనంటే పదవి నుంచి దింపడమని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారని ప్రశ్నించారు. ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంటని సెనేటర్‌ రూబియో కొట్టిపారేశారు. కావాలంటే ట్రంప్‌ను ఒక పౌరుడిగా కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్‌ చేయవచ్చని, అభిశంసన కుదరదని చెప్పారు. ట్రంప్‌ అభిశంసన అగ్గి రాజేయడమవుతుందని హెచ్చరించారు.

ట్రయల్‌ కొనసాగుతుంది
సెనేట్‌లో సాధారణ మెజార్టీ లభించినందున ట్రంప్‌పై అభిశంసన ట్రయల్‌ య«థాతథంగా కొనసాగనుంది. ఫిబ్రవరి 9న ట్రయల్‌ జరగనుంది. అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలు బలోపేతం చేసుకునే యత్నాలు చేస్తాయి. అయితే ట్రయల్‌ అనంతరం తీర్మానానికి రెండు సభల ఆమోదం అవసరం. డెమొక్రాట్ల అధీనంలోని హౌస్‌లో తీర్మానానికి ఆమోదం లభించినా సెనేట్‌లో మాత్రం ఆమోదం లభించదని తాజా ఓటింగ్‌తో తేలింది. అందువల్ల ట్రంప్‌పై అభిశంసన జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top