
దెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య 21 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో 60 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం మంగళవారం తెలిపింది. మంగళవారం నాటికి 60,034 మంది చనిపోగా మరో 1,45,870 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. మృతుల్లో కనీసం సగం మంది మహిళలు, చిన్నారులేనని తెలిపింది.
వైద్యరంగ నిపుణులతో కూడిన గాజా ఆరో గ్య విభాగం తెలిపే గణాంకాలను అత్యంత విశ్వసనీయమైనవిగా ఐరాస ఇతర స్వతంత్ర నిపుణులు కితాబునిస్తున్నారు. ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ ఫలితంగా గాజాలోని అత్యధిక ప్రాంతంలో విధ్వంసమే మిగిలింది. 90 శాతం మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారారు. ఆ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.
తాజాగా మరో 70 మంది మృతి
పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మాత్రం యథా ప్రకారం కొనసాగుతున్నాయని స్థానిక ఆస్పత్రి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో కనీసం 70 మంది చనిపోయారని తెలిపాయి. వీరిలో సగం మంది ఆహార కేంద్రాల వద్ద గుమికూడిన వారేనన్నాయి. సోమవారం దక్షిణ గాజా ప్రాంతంలోకి ప్రవేశించిన ఆహార ట్రక్కుల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 33 మంది చనిపోయినట్లు ఆస్పత్రులు వెల్లడించాయి.
మిగతా వారు సెంట్రల్ గాజాలోని ఆహార కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నాయి. అదేవిధంగా, నుసెయిరత్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో లో తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న 12 మంది చిన్నారులు, 14 మంది మహిళలు సహా 30 మంది అసువులు బాశారని అల్–ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కరువు వట్టిదే: ఇజ్రాయెల్
గాజాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయంగా తమపై ఒత్తిడి పెంచేందుకు గాజాలో కరువు ఉందంటూ తప్పుడు ప్రచారం మొదలైందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఒత్తిడుల వల్ల కాల్పుల విరమణతోపాటు బందీల విడుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి ప్రకటనలతో హమాస్ వైఖరి మరింత కఠినంగా మారితే తమ ప్రతిస్పందన సైతం తీవ్రంగానే ఉంటుందన్నారు.
గాజాలో అమానవీయ పరిస్థితులపై ప్రధాని మౌనం సిగ్గు చేటు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ నరమేధంతో సమానమైందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అభివర్ణించారు. మానవీయతే మచ్చ తెచ్చే పరిణామాలు గాజాలో చోటుచేసుకుంటున్నా మోదీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై ఆమె మండిపడ్డారు. ఇలాంటి వైఖరి మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లేనన్నారు. ఈ మేరకు ఆమె దైనిక్ జాగరణ్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. పాలస్తీనా విషయంలో మన దేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టంగా, ధైర్యంగా, నిష్కపటంగా వెల్లడించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. ఇజ్రాయెల్ అమానవీయ చర్యలను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.