అన్నంత పని చేసిన ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం | Middle East Crisis: Iran Fires Missiles Into Israel News Updates | Sakshi
Sakshi News home page

అన్నంత పని చేసిన ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం

Jun 8 2026 6:59 AM | Updated on Jun 8 2026 10:40 AM

Middle East Crisis: Iran Fires Missiles Into Israel News Updates

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్‌ బీరూట్‌ శివార్లపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్‌ రంగంలోకి దిగింది.  నేరుగా బాలిస్టిక్‌ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్‌ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.

ప్రతీకారమే!
ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు లెబనాన్‌ రాజధాని బీరూట్‌ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్‌పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్‌, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.

10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్‌
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్‌ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.

ఇజ్రాయెల్‌ ప్రతీకార హెచ్చరిక
ఇరాన్‌ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ Effie Defrin, "ఇరాన్‌ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఎయల్‌ జమీర్‌ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

ఏప్రిల్‌ తర్వాత..
ఏప్రిల్‌ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్‌ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్‌-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్‌ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.

రమత్‌ డేవిడ్‌ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా..
ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్‌ దళాలు ఇజ్రాయెల్‌లోని రమత్‌ డేవిడ్‌ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్‌కు చెందిన ఖాతమ్‌ అల్‌-అన్బియా కమాండ్‌ అధికారి మాట్లాడుతూ, బీరూట్‌ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్‌ అన్ని "రెడ్‌లైన్లను" దాటిందని ఆరోపించారు.

అన్నంత పని చేసిన ఇరాన్‌
"బీరూట్‌ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్‌ సైనికాధికారులు హెచ్చరించారు.

గగనతలం మూసివేత
ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్‌ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్‌, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

అమెరికా లక్ష్యాలకూ హెచ్చరిక
ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్‌ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్‌ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.

ట్రంప్‌ భిన్నాభిప్రాయం
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇజ్రాయెల్‌ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్‌ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.

మళ్లీ యుద్ధ భయాలు
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ తాజా ఘర్షణతో మిడిల్‌ఈస్ట్‌ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్‌, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement