Nicole Oliveira: ఎనిమిదేళ్ల స్పేస్‌ సైంటిస్ట్‌.. నాసాతో కలిసి పనిచేస్తోంది

Meet The Worlds Youngest Astronomer, 8 Year Old Brazilian Girl Nicole Oliveira - Sakshi

నికోల్‌ ఒలివెరా.. వయసు ఎనిమిదేళ్లు.. ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌ చేసే వయసు.. కానీ ఆమె ఏం చేస్తోందో తెలుసా..? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది. ఇది నిజమే.. అంతరిక్షంలో గ్రహశకలాల (ఆస్టరాయిడ్ల)ను గుర్తించే ‘ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ సెర్చ్‌ కొలాబరేషన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 18 ఖగోళ వస్తువుల (స్పేస్‌ ఆబ్జెక్ట్స్‌)ను గుర్తించింది కూడా. ప్రస్తుతం ప్రపంచంలోనే చిన్న వయసు ఆస్ట్రోనమర్‌గా నికోల్‌ నిలిచింది. బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా ప్రాంతానికి చెందిన నికోల్‌ ఒలివెరాకు చిన్నప్పటి నుంచే అంతరిక్షం అంటే ఇష్టమట. నడక నేర్చుకునే వయసులోనే ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు అంటూ పాఠాలు నేర్చుకుందట. 

నాసా స్పెషల్‌ ప్రాజెక్టుతో.. 
పిల్లలు, టీనేజీ విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తి కలిగించడం, వారే సొంతంగా కొత్త అంశాలను గుర్తించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా కొన్నేళ్ల కింద నాసా ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసి అందులో భాగస్వామ్యం చేసింది. దీనిలో నికోల్‌ ఒలివెరా ‘ఆస్టరాయిడ్‌ హంటర్‌’ బాధ్యతలకు ఎంపికైంది. రెండు పెద్ద స్క్రీన్లు ఉన్న కంప్యూటర్‌పై నాసా ఇచ్చే స్పేస్‌ మ్యాప్‌లను పరిశీలిస్తూ.. టెలిస్కోప్‌తో అంతరిక్షాన్ని జల్లెడపడుతూ.. 18 స్పేస్‌ ఆబ్జెక్ట్స్‌ను గుర్తించింది. నాసా శాస్త్రవేత్తలు మరోసారి వాటిని పరిశీలించి, ఆస్టరాయిడ్లుగా సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆ ఆస్టరాయిడ్లకు బ్రెజిల్‌ శాస్త్రవేత్తల పేర్లు పెడతానని నికోల్‌ చెప్తోంది. అంతేకాదు.. పెద్దయ్యాక ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ అయి రాకెట్లను తయారు చేయాలని ఉందని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top