వాషింగ్టన్‌లో సాయుధుడి అరెస్ట్‌ | Man arrested near US Capitol with loaded gun | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్‌లో సాయుధుడి అరెస్ట్‌

Jan 18 2021 6:26 AM | Updated on Jan 18 2021 6:26 AM

Man arrested near US Capitol with loaded gun - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా రాజధాని వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ వద్ద వెస్లీ అలెన్‌ బీలెర్‌ (31) అనే వ్యక్తి శుక్రవారం ఆయుధంతో తిరుగుతూ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడి కారులో నుంచి లైసెన్స్‌ లేని 9ఎంఎం హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెస్లీని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉగ్రవాదులతో అతడికి ఎలాంటి సంబంధాలు లేవని, తెలియకుండా ఆ ప్రాంతంలోకి వచ్చాడని నిర్ధారణ కావడంతో శనివారం విడిచిపెట్టారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న ఆరోపణతో కేసు నమోదు చేశారు.

భద్రతా సిబ్బందికి ఉచితంగా పిజ్జాలు
జో బైడెన్‌ యూఎస్‌ క్యాపిటల్‌ బిల్డింగ్‌ ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్దిరోజుల క్రితం ఇక్కడ డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అప్పటినుంచి ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది నిర్విరామంగా పహారా కాస్తున్నారు. వారి శ్రమను చూసి చలించిపోయిన ‘వి ద పిజ్జా’ అనే రెస్టారెంట్‌ ఉచితంగా పిజ్జాలు అందజేస్తూ అందరి మన్ననలు చూరగొంటోంది. సెక్యూరిటీ సిబ్బందికి భోజనం అందించడానికి రెస్టారెంట్‌ యాజమాన్యం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తోంది. వి ద పిజ్జా ఔదార్యం చూసిన మరికొన్ని రెస్టారెంట్లు కూడా ఉచితంగా భోజనం అందించడానికి ముందుకొచ్చాయి.  
హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాల స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement