మలేసియాలో పారని పాక్‌ పాచిక | Malaysia Rejects Pakistan Islamic Solidarity Card | Sakshi
Sakshi News home page

మలేసియాలో పారని పాక్‌ పాచిక

Jun 5 2025 5:19 AM | Updated on Jun 5 2025 5:19 AM

Malaysia Rejects Pakistan Islamic Solidarity Card

కౌలాలంపూర్‌: మలేసియా గడ్డపై పాకిస్తాన్‌ చేసిన భారతవ్యతిరేక కుయుక్తులు నిష్ఫలమయ్యాయి. ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూనే ఉగ్ర విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు మలేసియాలో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష దౌత్య బృందం ఆ దేశాధికారులతో సమావేశమైంది. అయితే ఈ భేటీను అడ్డుకునేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నించింది. మతాన్ని అడ్డుగా పెట్టే ప్రయత్నంచేసి చివరకు భంగపడింది. 

జేడీ(యూ) ఎంపీ సంజయ్‌ ఝా నేతృత్వంలోని భారత అఖిలపక్ష దౌత్య బృందం మలేసియాలో 10 వేర్వేరు భేటీలకు సిద్దమవగా ఈ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని మలేసియా ప్రభుత్వానికి అక్కడి పాకిస్తాన్‌ ఎంబసీ లేఖ రాసింది. ‘‘ మనం మనం ఒక్కటే. మన రెండు దేశాలూ ముస్లిం దేశాలే. భారత ప్రతినిధి బృందం చెప్పే అంశాలకు విలువ ఇవ్వకండి. అసలు వాళ్లకు అనుమతే ఇవ్వకండి.

 మొత్తం 10 వేర్వేరు కార్యక్రమాలను జరగనివ్వకండి’’ అని ఆ లేఖలో పాకిస్తాన్‌ తన అక్కసు వెళ్లబోసుకుంది. అయినాసరే మలేసియా సర్కార్‌ భారత్‌కే మద్దతు పలికింది. మొత్తం 10 కార్యక్రమాలకూ అనుమతి ఇచ్చింది. మలేసియా పార్లమెంట్‌ స్పీకర్‌ వైబీ టాన్‌ శ్రీ దాటో జొహారీ బిన్‌ అబ్దుల్‌తో సంజయ్‌ఝా బృందం భేటీ అయి పాక్‌ ఉగ్రధోరణిని వివరించింది.

బిలావల్‌ భుట్టోకు చేదు అనుభవం
భారత్‌కు పోటీగా అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ దౌత్య బృందానికి సారత్యంవహిస్తున్న ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్‌ పీపుల్స్‌పార్టీ(పీపీపీ) నేత బిలావల్‌ భుట్టో జర్దారీకి న్యూయార్క్‌లకు చేదు అనుభవం ఎదురైంది. పహల్గాం దాడి తర్వాత భారత్‌లో ముస్లింలను దూషించడం ఎక్కువైందని, వాళ్లను దయ్యాల్లా చూస్తున్నారని బిలావల్‌ అమెరికాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. 

ఈయన వ్యాఖ్యలను ముస్లిం జర్నలిస్ట్‌ అహ్మద్‌ ఫథీ మీడియా సమావేశంలో లేవనెత్తి బిలావల్‌ను ఇరుకునపెట్టారు. ‘‘ పహల్గాం ఘటనను భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుతోందనేది పూర్తిగా తప్పు. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను భారత్‌ తరఫున ముస్లిం మహిళా నావికాధికారి మీడియాకు వివరించారు. ముస్లింలను భారత్‌ తన ప్రతినిధులుగా భావిస్తోందికదా?’’ అని ప్రశ్నించారు. దీంతో బిలావల్‌ ముఖం ఎర్రబడింది. ఏం చెప్పాలో తెలీక నీళ్లు నమిలారు. భారత దాడి వివరాలను కల్నల్‌ సోఫియా ఖురేషి వివరించడం తెల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement