కరోనా కలిపింది ఇద్దరినీ..

Long lost sisters from Nebraska credit COVID-19 - Sakshi

50 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కాచెల్లెళ్లు

నెబ్రాస్కా: కరోనా వైరస్‌ మనుషుల్ని విడదీస్తూ మానవ సంబంధాలను దెబ్బతీస్తూ ఉంటే ఆ తోబుట్టువులను మాత్రం ఏకం చేసింది. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారిద్దరూ కరోనా వైరస్‌ తమ పాలిట దైవం అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఒక న్యూస్‌ ఛానెల్‌తో వారు పంచుకున్న అనుభూతులు ప్రకారం.. అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన డోరిస్‌ క్రిపెన్‌(73) కరోనా సోకడంతో ఫ్రీమెంట్‌ నగరంలోని ఒక ఆస్పత్రిలో చేరింది.

అక్కడ ఆమెకు వైద్యం చేసింది ఎవరో కాదు. ఆమె తోడబుట్టిన చెల్లెలు బేవ్‌ బోరో. 1967లో తండ్రి మరణానంతరం తల్లి లేకపోవడంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ చెరో చోట పెరిగారు. బోరోకి ఆరు నెలలు ఉన్నప్పుడు ఇద్దరూ విడిపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా ఆస్పత్రిలో కలుసుకున్నారు. బోరో ఆస్పత్రికి వచ్చిన రోగుల జాబితా చూస్తూ ఉంటే క్రిపెన్‌ పేరు కనిపించింది. తన అక్క పేరు కూడా అదే కదా ఆమే అయి ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ క్రిపెన్‌ చికిత్స పొందుతున్న వార్డుకి వచ్చింది.

ఆమెకి వినికిడి సమస్య ఉండడంతో ఒక బోర్డు మీద మీ తండ్రి పేరు వెండాల్‌ హఫ్‌మ్యాన్‌? అని రాసింది. దానికి క్రిపెన్‌ అవునని తలూపడంతో బోరో భావోద్వేగాలను పట్టలేకపోయింది. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ నేను నీ చెల్లెలు బోరోని అంటూ మళ్లీ రాసింది. అది చదివిని క్రిపెన్‌కి కుర్చీలోంచి కింద పడ్డంత పనైంది. ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ తోబుట్టువులు సంతోషంలో మునిగిపోయారు. కరోనా కలిపింది ఇద్దరినీ అంటూ హాయిగా పాడుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top