బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మహిళా జర్నలిస్టు అమల్ ఖలీల్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్–హెజ్‌బోల్లా యుద్ధ సంబంధ వార్తలను సేకరించేందుకు విధి నిర్వహణలో భాగంగా యుద్ధక్షేత్రంలో ఉన్న ఉన్నప్పుడు అమల్ ఖలీల్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెతోపాటు వచ్చి యుద్ధం ఫొటోలు తీస్తున్న ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ జినాబ్ ఫరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్‌లోని అల్–అఖ్బర్ వార్తాపత్రికలో పనిచేస్తున్న 43 ఏళ్ల ఖలీల్, ఫోటోగ్రాఫర్ ఫరాజ్ ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణిండగా వీళ్ల సమీపంలోని మరో వాహనంపై దాడి జరిగింది.
దీంతో ఆ వాహనంలోని ఇద్దరు ప్రాణాలుకోల్పోయారు. ఇది చూసి వీరిద్దరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమీప ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే తర్వాత ఆ ఇంటి మీద సైతం వైమానిక దాడి జరిగింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. విషయం తెల్సి లెబనాన్ ఆర్మీ, పౌర రక్షణ బలగాలు, లెబనాన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు. ఆరుగంటల తర్వాత శిథిలాల నుంచి ఖలీల్ మృతదేహాన్ని బయటకుతీశారు. దక్షిణ లెబనాన్‌లోని అల్–తిరీ గ్రామంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది.


