‘డెల్టా’ డేంజర్‌ బెల్స్‌!

Leading doctors say delta variant is fast, fit and formidable - Sakshi

టీకా రెండు డోసుల తర్వాత కూడా సోకే ప్రమాదం

ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

కరోనా డెల్టా వేరియంట్‌ ప్రమాదకారుల్లోకెల్లా ప్రమాదకారి అని నిరూపించే గణాంకాలు, అధ్యయనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలోని కోవిడ్‌ వైరస్‌ వేరియంట్లన్నింటిలోకి డెల్టా వేరియంట్‌ వేగవంతమైన, ప్రభావవంతమైనదని, టీకా తీసుకోని వారిలో ఈ వేరియంట్‌ ప్రభావం అధికమని తెలుసు! అయితే తాజాగా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి సైతం ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సత్తా డెల్టాకు ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా టీకా తీసుకున్నా సరే డెల్టా సోకినవారు ఇతరులకు దీన్ని వ్యాప్తి చేయగలరని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టానే అని సైంటిస్టు షారన్‌ పీకాక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను ‘‘ఫిట్‌ అండ్‌ ఫాస్ట్‌’’గా అభివర్ణించారు. దీని దెబ్బకు టీకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో తిరిగి ఆంక్షలు విధించాల్సిన అవసరం వచ్చేలాఉందన్నారు.

ఫైజర్‌ ప్రభావం అంతంత మాత్రమేనా?
ఇప్పటివరకు కోవిడ్‌పై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైనదని భావిస్తున్న ఫైజర్‌ టీకా డెల్టాపై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని ఇజ్రాయిల్‌లో బయటపడ్డ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో డెల్టా వేరియంట్‌పై టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయన్న నిపుణుల భయాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రిపాలైనవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారున్నారు. సింగపూర్‌లో సైతం ఇదే ధోరణి కనిపించింది.

ఇజ్రాయిల్‌లో కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 60 శాతంమంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నవారేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఎస్‌లో నూతన ఇన్‌ఫెక్షన్లలో 83 శాతం డెల్టా వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈయూలోని మొత్తం 28 దేశాలుండగా, ప్రస్తుతం 19 దేశాల్లో డెల్టా జోరు పెరిగిందని డబ్లు్యహెచ్‌ఓ హెచ్చరించింది. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఈసీడీసీ)సైతం ఇదే హెచ్చరికలు చేసింది. ఈతరహా కొనసాగితే ప్రపంచమంతా డెల్టా ఆధిపత్యం వ్యాపించేందుకు వారాలు చాలని పేర్కొంది. ఇది ఇలాగే వ్యాపిస్తూ మరో కొత్త వేరియంట్‌గా మారితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసింది.

ముక్కులో వైరస్‌ లోడు
సాధారణ కోవిడ్‌ వేరియంట్లు సోకిన రోగి ముక్కులో ఉండే వైరల్‌ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్‌ సోకిన రోగి ముక్కులో వైరస్‌లోడు ఉంటుందని చైనాలో జరిపిన మరో అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి మరింత వేగవంతమవుతోందని పీకాక్‌ విశ్లేషించారు. డెల్టా ఇన్‌ఫెక్షన్ల కారణంగా వ్యాక్సినేషన్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కానీ అసలు టీకా తీసుకోకుండా ఉండడం కన్నా ఏదో ఒక టీకా తీసుకోవడం చాలా బెటరని సూచిస్తున్నారు.  

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top