ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం కదా? ఇక్కడి నుంచి అమెరికాకో, ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు భారీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య.. అంటే ఆస్ట్రేలియా తూర్పు తీరానికి (సిడ్నీ, మెల్‌బోర్న్), ఐరోపా (లండన్) లేదా అమెరికా తూర్పు తీరానికి (న్యూయార్క్) మధ్య ఇంతవరకు చరిత్రలో ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ కమర్షియల్ ఫ్లైట్ కూడా లేదు!
సిడ్నీ, మెల్‌బోర్న్ లాంటి ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల నుంచి లండన్ లేదా న్యూయార్క్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆగాల్సిందే . కానీ, ఏవియేషన్ హిస్టరీని తిరగరాస్తూ, భూగోళంపై ఉన్న చివరి సరిహద్దును బద్దలు కొట్టడానికి ఒక అద్భుతం సిద్ధమవుతోంది.
అసలు ఆస్ట్రేలియా నుంచి లండన్‌కు డైరెక్ట్ ఫ్లైట్ ఎందుకు లేదు? సమాధానం చాలా సింపుల్.. భౌగోళిక దూరమే ఇందుకు కారణం. ఆస్ట్రేలియాను గ్లోబ్ మీద నుంచి తీసి దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో పెడితే, అది నార్త్ అట్లాంటిక్‌లో యూరప్, అమెరికాల మధ్యన ఉంటుంది. అంటే, అవి భూమికి రెండు చివర్లలో ఉన్నాయన్నమాట. ఇంత దూరం ప్రయాణించగలిగే సాంకేతికత, అంత బరువు మోయగలిగే ఇంధన సామర్థ్యం ఉన్న విమానాలు ఇప్పటివరకు లేవు.
లండన్ - సిడ్నీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ అనేది ఏవియేషన్ ప్రపంచానికి ఒక 'హోలీ గ్రెయిల్' లాంటిది. 1989లోనే బోయింగ్ 747 విమానం లండన్ నుండి సిడ్నీకి నాన్‌స్టాప్‌గా వచ్చింది. కానీ అది కేవలం టెస్ట్ ఫ్లైట్. అందులో ప్రయాణికులు లేరు, లగేజీ లేదు. పైగా.. స్పెషల్ ఫ్యూయెల్‌తో నడిచింది. కానీ, వచ్చే సంవత్సరం.. అవును, 2027లో క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ (Qantas Airlines) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. సుమారు 22 గంటల పాటు నిరంతరాయంగా సాగే ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రారంభించబోతోంది.
22 గంటలు ఒకే ఫ్లైట్‌లో కూర్చోవడం నరకంలా అనిపిస్తుందనుకుంటున్నారా..? అయితే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. 18వ శతాబ్దంలో బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు ఓడల్లో వెళ్లడానికి 8 నుంచి 12 నెలల సమయం పట్టేది! 1850ల నాటికి వేగవంతమైన క్లిప్పర్ షిప్స్ వచ్చి.. ఆ సమయాన్ని 3-4 నెలలకు తగ్గించాయి. ఆ తర్వాత స్టీమ్ షిప్స్, సూయజ్ కాలువ రావడంతో దూరాభారం కాస్తా 30 నుంచి 50 రోజులకు తగ్గింది.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక.. అంటే 1919లో 'గ్రేట్ ఎయిర్ రేస్' పేరుతో లండన్ నుంచి ఆస్ట్రేలియాకు మొదటి విమాన ప్రయాణం జరిగింది. రాస్ స్మిత్, కీత్ స్మిత్ అనే ఇద్దరు ఆస్ట్రేలియన్ సోదరులు మోడిఫైడ్ బాంబర్ విమానంలో లండన్ నుంచి బయలుదేరారు. దారిలో విశ్రాంతి కోసం, ఇంధనం కోసం 14 స్టాప్‌లు ప్లాన్ చేసుకుంటే.. వాతావరణం అనుకూలించక, టెక్నికల్ సమస్యల వల్ల ఏకంగా 23 చోట్ల ఆగాల్సి వచ్చింది. లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని డార్విన్ చేరుకోవడానికి వారికి 27 రోజుల 20 గంటల సమయం పట్టింది! అప్పట్లో అది ఒక మిరాకిల్. ఒక నెల లోపు ప్రయాణం సాధ్యమని వారిద్దరూ నిరూపించారు.
1935లో క్వాంటాస్, ఇంపీరియల్ ఎయిర్‌వేస్ కలిసి మొదటి కమర్షియల్ రూట్‌ను ప్రారంభించాయి. లండన్ టు బ్రిస్బేన్. కానీ ప్రయాణం ఎలా ఉండేదో తెలుసా? వారానికి ఒకే ఒక్క ఫ్లైట్. ప్రయాణ సమయం పన్నెండున్నర రోజులు..! దారిలో పారిస్, ఏథెన్స్, బగ్దాద్, కరాచీ, ఢిల్లీ, కోల్‌కతా, బ్యాంకాక్, సింగపూర్.. ఇలా ఏకంగా 28 స్టాప్‌లు ఉండేవి..! రాత్రిపూట ప్రయాణికులు హోటళ్లలో స్టే చేయాల్సి వచ్చేది. కేవలం 10 మంది ప్రయాణించే ఆ ఫ్లైట్ టికెట్ ధర అప్పట్లో 195 పౌండ్లు. అంటే, నేటి 2026 నాటి కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అది దాదాపు 50,000 డాలర్లు.. అంటే మన రూపాయిల్లో సుమారు 40 లక్షల రూపాయల పైమాటే! 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో క్వాంటాస్ మరో సాహసం చేసింది.
ఐదు కేటాలినా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పెర్త్ నుంచి శ్రీలంకకు ఎలాంటి రేడియో సాయం లేకుండా, కేవలం దిక్సూచి, నక్షత్రాల ఆధారంగా రాత్రి వేళల్లో శత్రువుల కళ్లుగప్పి ప్రయాణించింది. 27 నుంచి 33 గంటల పాటు సాగిన ఆ ప్రయాణంలో ప్రయాణికులు రెండు సూర్యోదయాలను చూశారు. అందుకే దీన్ని 'డబుల్ సన్‌రైజ్ సర్వీస్' అన్నారు. ఈ రూట్‌నే ఆ తర్వాత క్వాంటాస్ 'కంగారూ రూట్' అని పిలిచింది.. ఎందుకంటే విమానం కంగారూలా గెంతుతూ వెళ్లేది కాబట్టి. 1959లో జెట్ యుగం అంటే.. Boeing 707 శకం వచ్చింది. ప్రయాణ సమయం 38 గంటలకు తగ్గింది. 1971లో బోయింగ్ 747 రావడంతో స్టాప్‌లు రెండింటికి తగ్గి, మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా విదేశీ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 1988 నాటికి సింగపూర్ ఒక్కటే ఏకైక స్టాప్‌గా మారి, ప్రయాణ సమయం 25 గంటలకు తగ్గడం గమనార్హం..!
ఇక ఇప్పుడు 21వ శతాబ్దం... 2027లో అద్భుతం జరగబోతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2017లో క్వాంటాస్ ప్రకటించిన 'ప్రాజెక్ట్ సన్‌రైజ్' కల సాకారం కాబోతోంది. ఎయిర్‌బస్ సంస్థ క్వాంటాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'Airbus A350-1000 ULR' విమానాలు ఈ అద్భుతాన్ని చేయబోతున్నాయి. సాధారణ విమానాల కంటే ఇందులో 20 వేల లీటర్ల ఇంధనం అదనంగా పట్టే ట్యాంక్ ఉంటుంది. బరువు తగ్గించడం కోసం సీట్లను 300 నుండి 238కి తగ్గించారు. లండన్ నుంచి సిడ్నీకి 17,000 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల్లో, ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ విమానం దాటబోతోంది. 2024లో రెగ్యులేటరీ సమస్యలు, ఆ తర్వాత 2026 ప్రారంభంలో సప్లై చైన్ లోపాల వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం ఐరోపాలో పరీక్షలు జరుగుతున్నాయి. 2027 Second halfలో ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇదే విమానాన్ని సిడ్నీ - న్యూయార్క్ మధ్య కూడా నడపబోతున్నారు.
మరి 22 గంటలు ఫ్లైట్‌లో ఎలా గడపాలి అని కంగారు పడకండి. ఇందులో విశాలమైన ఫస్ట్ క్లాస్ సూట్లు, ప్రైవసీ ఉన్న బిజినెస్ క్లాస్ రూమ్‌లతో పాటు.. ఎకానమీ క్లాస్‌లోనూ ఎక్కువ లెగ్‌రూమ్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రయాణికులు నిలబడి స్ట్రెచింగ్ చేసుకోవడానికి, వ్యాయామం చేయడానికి విమానంలో ప్రత్యేకంగా ఒక Well-being Zoneను ఏర్పాటు చేస్తున్నారు. 1919లో 28 రోజులు పట్టిన ప్రయాణం.. వందేళ్ల నిరంతర సాంకేతిక పరిణామం వల్ల 2027 నాటికి కేవలం ఒకే ఒక్క రోజు లోపలికి వచ్చేస్తోంది. మానవ మేధస్సుకు, సాంకేతిక ప్రగతికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి? ఇది ఈనాటి మన ఏవియేషన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని పాడ్‌కాస్ట్‌లను మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.


