చర్చలు జరుపుతూనే బాంబుల వర్షం.. 13 మంది మృతి | Israel Strikes Multiple Lebanon Towns | Sakshi
Sakshi News home page

చర్చలు జరుపుతూనే బాంబుల వర్షం.. 13 మంది మృతి

Apr 15 2026 7:46 PM | Updated on Apr 15 2026 8:18 PM

Israel Strikes Multiple Lebanon Towns

బీరుట్‌: లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలను చారిత్రక చర్చలని పేర్కొంటున్నారు. అయితే, అటు చర్చలు జరుగుతుండగానే ఇటు లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్‌ మళ్లీ భీకర దాడులకు దిగింది. 

దక్షిణ లెబనాన్ పట్టణాలపై మరిన్ని ఘోర దాడులను ప్రారంభించింది. లెబనాన్ ప్రభుత్వ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన దాడుల్లో 13 మంది మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులు అమెరికాలో సమావేశమైన 24 గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరిగింది.

హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగం
ఇరాన్‌ మద్దతు ఉన్న హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపామని ప్రకటించింది. హిజ్బుల్లా సుమారు 30 రాకెట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో మెటులా, కఫర్ గిలాడి, కిర్యాత్ ష్మోనా ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎంతగా కొనసాగుతున్నాయో ఇది సూచిస్తోంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి. సైడాన్ జిల్లా అల్-బబ్లియా ప్రాంతంలో డ్రోన్ దాడి, ఖలీలా పట్టణంపై వైమానిక దాడి జరిగినట్లు సమాచారం.

గాజాలో వాడిన విధానాలను దక్షిణ లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ సైన్యం వాడుతున్నట్లు తెలుస్తోంది. హారెట్జ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఉపయోగించిన విధానాల‍్లాగే దక్షిణ లెబనాన్ గ్రామాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్ సైనికులను ఉటంకిస్తూ వెలువడింది.

ఇళ్లను ప్రణాళికాబద్ధంగా కూల్చివేస్తున్నారు. కొందరు సైనికులు రోజువారీగా కూల్చిన భవనాల సంఖ్య ఆధారంగా లక్ష్యాలు నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతాలను దాటి మరింత లోతుగా దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించాయి. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement