ఇజ్రాయెల్‌లో సంస్మరణ కార్యక్రమాలు
మృతులకు దేశవ్యాప్తంగా నివాళులు
హమాస్‌ను అంతం చేయడంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ విఫలం
ఆగ్రహం వ్యక్తం చేసిన జనం
జెరూసలేం: సరిగ్గా మూడేళ్ల క్రితం.. 2023 అక్టోబర్ 7న గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడ్డారు. అనూహ్యంగా దాడులకు దిగారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు 1,200 మందిని పొట్టన పెట్టుకున్నారు. 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. హమాస్ దుశ్చర్యకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైతం వెంటనే సైనిక చర్య ప్రారంభించింది. గాజాలో ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో 74,200 మందికి పైగా మరణించారు.
వీరిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులే అధిక సంఖ్యలో ఉన్నారు. వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. చాలామంది నిరాశ్రయులయ్యారు. హమాస్ దాడికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి ఘోరకలిని ఇజ్రాయెల్ బుధవారం గుర్తుచేసుకుంది. మృతులకు నివాళులర్పించింది. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో మర్చిపోలేని ఉత్పాతంగా నిలిచింది. గూఢచార సామర్థ్యం, ఆధునిక సాంకేతికత పట్ల గర్వపడే యూదు దేశం చిరకాల ప్రతిష్టకు సవాలు విసిరింది. భారీ నష్టాన్ని కలిగించింది. ఆ సమయంలో దేశాన్ని ఏకం చేసింది. కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. తమ ప్రధాన శత్రువైన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యాన్ని ఇజ్రాయెల్ ఇంకా సాధించలేదు.
కార్ల శిథిలాల ప్రదర్శన
గాలి, భూమి, సముద్ర మార్గాల ద్వారా బహుముఖ దాడిని చేపట్టిన హమాస్ గ్రూప్ అక్టోబర్ 7 నాటి ఘటనను ‘అసాధారణ సైనిక విజయం’గా అభివర్ణించిందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ బుధవారం పేర్కొంది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించారు. హమాస్‌ను అణచివేయడంలో విఫలమైన ఇజ్రాయెల్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు సైతం జరిగాయి. మూడేళ్ల క్రితం ఉదయం 6:29 గంటలకు ఇజ్రాయెల్‌పై తొలి దాడి జరిగింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 6:29 గంటలకు స్మారక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ‘నోవా సంగీత ఉత్సవం జరిగిన కిబుట్జ్ రీమ్ వద్ద బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. మృతులకు నివాళులర్పించారు. ఈ ప్రదేశంలోనే హమాస్ మిలిటెంట్లు 378 మందిని దారుణంగా హతమార్చి, 44 మందిని బందీలుగా గాజాకు తరలించిన సంగతి తెలిసిందే. టెల్ అవీవ్‌లోని యార్కాన్ పార్క్‌లోనూ సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) సమీపంలో జరిగిన ఒక సమావేశంలో.. అక్టోబర్ 7న దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన గల్ గోరెన్ అనే వ్యక్తి మాట్లాడారు. ‘‘మూడేళ్లుగా పీడిస్తున్న అపరాధభావం, అవమానం, పశ్చాత్తాపం గురించి మీరేమంటారు?’’ అని ప్రశ్నించారు. టెల్ అవీవ్ సిటీ నడిబొడ్డున ఉన్న డిజెంగోఫ్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ ఫౌంటెన్‌కు బుధవారం ఉదయం ఎరుపు రంగు వేశారు. నోవా సంగీతోత్సవ మారణకాండ బాధితులకు చెందిన, పూర్తిగా కాలిపోయిన కార్ల శిథిలాలను నిరసనకారులు నెసెట్ బయట జరిగిన ప్రదర్శనకు తీసుకొచ్చారు.
నెతన్యాహు సర్కార్ అసమర్థతపై ఆగ్రహం
సీసరియాలోని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసం, జెరూసలేంలోని ఆయన అధికారిక నివాసం, టెల్ అవీవ్‌లోని నెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా ఇల్లు, మోడియిన్‌లోని న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ ఇల్లు, హోడ్ హషరోన్‌లోని విద్యా శాఖ మంత్రి యోవావ్ కిష్ ఇల్లుతోపాటు సీనియర్ రాజకీయ నాయకుల నివాసాల వద్ద కూడా నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. హమాస్ విషయంలో నెతన్యాహు ప్రభుత్వ అసమర్థతపై నిరసనకారులు నిప్పులు చెరిగారు.
మారణకాండ జరిగిన మూడేళ్ల తర్వాత ఈసారైనా నెతన్యాహు మేల్కొనేలా చూసేందుకు ఉదయం 6:29 గంటలకు నెతన్యాహు నివాసం వద్దకు తాము వచ్చినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఒక ఉదయం అందిన భయంకరమైన దాడుల సమాచారంపై స్పందించడంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చాలా ఆలస్యం చేశారని ఆక్షేపించారు. మరోవైపు ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, స్థానిక సంస్థలు, వ్యాపార సంస్థల్లో కూడా స్మారక కార్యక్రమాలు నిర్వహించారు.
మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ హమాస్‌ను నిర్వీర్యం చేయలేదని గాజా భవిష్యత్తు అపరిష్కృతంగా ఉందని, గాజాను ఎవరు పరిపాలిస్తారనే ప్రశ్నకు సమాధానం లభించలేదని విశ్లేషకులు, ప్రజలు పేర్కొంటున్నారు. అక్టోబర్ 27న జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో హమాస్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ప్రతిపక్షాల ప్రధాన ఎన్నికల అజెండాగా మారింది. తాము అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తామని నెతన్యాహు వ్యతిరేక కూటమి నాయకులు హామీ ఇస్తున్నారు.


