11 రోజుల్లోనే ... హమాస్‌ కీలక నేత హతం | Israel says strike eliminated new chief of Hamas armed wing in Gaza | Sakshi
Sakshi News home page

11 రోజుల్లోనే ... హమాస్‌ కీలక నేత హతం

May 27 2026 1:13 PM | Updated on May 27 2026 2:15 PM

Israel says strike eliminated new chief of Hamas armed wing in Gaza

గాజాలో యుద్ధ ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందాలను ఇరుపక్షాలూ తుంగలో తొక్కడంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. కేవలం పదకొండు రోజుల క్రితమే హమాస్ సైనిక చీఫ్‌గా నియమితుడైన మొహమ్మద్ ఒదేహ్ తాజా ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. హమాస్ ఇంకా దీనిపై స్పందించలేదు.


అక్టోబర్ 7 మారణకాండ సూత్రధారులలో ఒకడు,  హమాస్ సైనిక విభాగం నాయకుడు,మహమ్మద్ ఒడెహ్‌ను గాజాలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు,ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక సంయుక్త ప్రకటనలో బుధవారం తెలిపారు. అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించినందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF)  షిన్ బెట్‌కు కాట్జ్  అభినందనలు తెలిపారు. ఇస్లాం ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఈద్ అల్-అధాకు ముందు మంగళవారం రాత్రి గాజా నగరంలో ఇజ్రాయెల్ రెండు వైమానిక దాడులు జరిపింది, ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు.

ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఇంతకుముందున్న కమాండర్‌ ఎజ్జెడిన్ అల్-హద్దాద్‌ని ఖతం చేసింది.  ఇతని స్థానంలో కొత్త  చీఫ్‌గా మొహమ్మద్ ఒదేహ్‌ ఎన్నికైరెండు వారాలు కూడా గడవకముందే ఐడీఎఫ్ (IDF) జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.  గాజా ఉగ్రవాద నెట్‌వర్క్ గుండెకాయపై దెబ్బకొట్టి, అగ్రస్థానంలో ఉన్న వ్యక్తిని ఇజ్రాయెల్ మరోసారి మట్టుబెట్టింది. 11 రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఏ సురక్షిత స్థావరమూ అతడిని రక్షించలేకపోయింది. సంస్థాగతంగా చేసిన మార్పులేవీ అతడిని కాపాడలేకపోయాయి. అంతర్జాతీయ సమాజం నుండి వస్తున్న కాల్పుల విరమణ ఒత్తిడి ఇజ్రాయెల్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతోంది.

ఇజ్రాయెల్ భద్రతా అధికారుల ప్రకారం... హోలోకాస్ట్ (యూదుల మారణహోమం) తర్వాత యూదులపై జరిగిన అత్యంత ఘోరమైన అనాగరికం, అక్టోబర్ 7, 2023 నాటి ఊచకోత సమయంలో మొహమ్మద్ ఒదేహ్ హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశాడు. 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకుని, వారి ఇళ్లలోనే కుటుంబాలను ముక్కలు ముక్కలుగా నరికి, బందీలను గాజా భూగర్భ సొరంగాల్లోకి లాక్కెళ్లిన ఉగ్రవాద ఆపరేషన్ మాస్టర్‌మైండ్స్‌లో ఇతను కూడా ఒకడు. ఆ దాడిని ప్లాన్ చేసిన లేదా అమలు చేసిన ప్రతి సీనియర్ కమాండర్‌ను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ చేపట్టిన ప్రచారంలో భాగంగా, గత వారం అతడిని హమాస్ మొత్తం సైనిక విభాగానికి నాయకుడిగా నియమించింది. ఒక మంగళవారం నాడు నియమితుడైన అతను, తదుపరి నెల రాకముందే శవమయ్యాడు.

మహ్మద్ ఒదెహ్ ఎవరు?
మహమ్మద్ ఒదే 1974లో ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో జన్మించాడు.  హమాస్ ఉగ్రవాద సంస్థలో ఒక సీనియర్ నాయకుడు.  తన సన్నిహితుడు మాజీ కమాండర్  హద్దాద్ హత్య తర్వాత, 2026 మే నెలలో అతను అల్-ఖస్సాం బ్రిగేడ్స్ అధిపతిగా , గాజాలో హమాస్ నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు.

రెండవ ఇంతిఫాదా సమయంలో 2000లో ఖస్సాం బ్రిగేడ్స్‌లో చేరాడు. యహ్యా సిన్వార్ మరియు మహమ్మద్ డీఫ్ సహా హమాస్ సీనియర్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపై నిఘా సమాచారం సేకరించడంలో, బలహీనతలను గుర్తించడంలో ఒడెహ్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఉత్తర గాజాలోని యూనిట్లకు నాయకత్వం వహించి, ఉత్తర బ్రిగేడ్ కమాండర్‌గా (2017–2019) పనిచేశాడు. కీలక నాయకులు హతమయ్యాక గాజాలో హమాస్ నాయకుడిగా  ఎదిగాడు..
 

Advertisement
 
Advertisement
Advertisement