ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు అగ్రశ్రేణి అధికారులు మృతి
ఖమేనీ కుడిభుజం అలీ లారిజానీ, జనరల్ సులేమానీ హతం
ఇరాన్ నాయకత్వం వెన్నెముక విరిచేశాం
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటన
గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు
టెహ్రాన్, బీరూట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి
దుబాయ్: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడిభుజంగా పనిచేసిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీతోపాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ)కు చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్‌రెజా సులేమానీ తమ దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం వెన్నుముక విరిచేశామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడింది.
అత్యున్నత సైనికాధికారులు నివాసం ఉండే కీలక స్థావరాలపై క్షిపణలు, డ్రోన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీ, ఘోలమ్‌రెజా సులేమానీ సహా పలువురు మృతిచెందారు. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఇరాన్ తమ అగ్రశ్రేణి అధికారులను కోల్పోవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం వైమానిక దాడులు కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ రెండు క్షిపణుల ప్రయోగించిట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. యూఏఈలోని దుబాయ్‌పై ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దాంతో ముందుజాగ్రత్తగా దుబాయ్ గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు. అబూదాబీపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ మిస్సైల్‌ను అబూదాబీ సైన్యం కూల్చివేసింది. ఈ శకలాల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు.
బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై దాడి
గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచి ఉన్న చమురు ట్యాంకర్‌పై తాజాగా డ్రోన్‌తో దాడికి దిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు విడవడం లేదు. అక్కడ చమురు రవాణాపై ఆంక్షలు కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ తేల్చిచెప్పారు. తమ దేశంపైకి రాకెట్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయని, తాము ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండిపోవాలా? అని ప్రశ్నించారు.
ఇరాన్ మంగళవారం ఉదయం పదుల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. ఖతార్‌లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దండును విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణశాఖ తేల్చిచెప్పింది. అయితే, క్షిపణుల శకలాలు నేలకూలడంతో మంటలు చెలరేగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపైనా దాడి జరిగింది. నాలుగు డ్రోన్లను ఎంబసీ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. పలు డ్రోన్లు ప్రయోగించారు.
లెబనాన్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెహ్రాన్‌తోపాటు లెబనాన్ రాజధాని బీరూట్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. కమాండ్ సెంటర్లు, మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడికి దిగింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ సేనలు దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌తో ప్రత్యక్షంగా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, లెబనాన్ సైన్యం అందుకు ఒప్పుకోవడం లేదు.
ఖమేనీకి నీడలా లారిజానీ
అలీ లారిజానీ ఘనమైన నేపథ్యం ఉంది. ఇరాన్‌లో ప్రముఖ రాజకీయ కుటుంబంలో జని్మంచారు. పార్లమెంటరీ స్పీకర్‌గా పనిచేశారు. ఇరాన్ సాంస్కృతిక మంత్రిగా వ్యవహారించార. ప్రజలపై ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వానికి విధానపరమైన సలహాదారుగా సేవలందించారు. అణ్వాయుధాల అంశంపై అమెరికాతో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఖమేనీకి సలహాదారుగా నియమితులయ్యారు. అత్యున్నత భద్రతా విభాగమైన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఎదిగారు. ఖమేనీకి నీడగా నిలిచారు. తత్వశాస్త్రంపై లారిజానీ ఆరు పుస్తకాలు రాశారు.
కరడుగట్టిన బసిజ్ మిలీíÙయా ఫోర్స్ చీఫ్ సులేమానీ 1965లో జని్మంచారు. ఇటీవల ఇరాన్‌లో జరిగిన నిరసన కార్యక్రమాలను ఉక్కుపాదంలో అణచివేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ ప్రజలపై హింసకు పాల్పడిందని, అరెస్టులు చేసిందని ఇజ్రాయెల్ సహా పశి్చమ దేశాలు పేర్కొన్నాయి. బసిజ్ మిలీషియా ఫోర్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది. సులేమానీ మరణంతో ఆ దళం చాలావరకు బలహీనపడినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వారిద్దరూ గ్యాంగ్‌స్టర్ అసిస్టెంట్లు
లారిజానీ మృతిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపర్చి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లో ఉండాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. అలీ లారిజానీతోపాటు బసిజ్ చీఫ్ సులేమానీని హతమార్చామని ప్రకటించారు. వారిద్దరూ గ్యాంగ్‌స్టర్(అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లు అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని విమర్శించారు.


