Israel Hezbollah War: హెజ్‌బొల్లా అగ్రనేత హతం | Israel Hezbollah War: Israeli Strike Kills Another Hezbollah Leader Nabil Kaouk | Sakshi
Sakshi News home page

Israel Hezbollah War: హెజ్‌బొల్లా అగ్రనేత హతం

Sep 30 2024 5:03 AM | Updated on Sep 30 2024 5:03 AM

Israel Hezbollah War: Israeli Strike Kills Another Hezbollah Leader Nabil Kaouk

క్షిపణి దాడుల్లో నబీల్‌ మృతి

లెబనాన్‌పై కొనసాగుతున్న దాడులు 

జెరూసలేం:  లెబనాన్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్‌బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఇజ్రాయెల్‌ సైన్యం దాడిలో సంస్థ సెంట్రల్‌ కౌన్సిల్‌ డిప్యూటీ హెడ్‌ నబీల్‌ కౌక్‌ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం వెల్లడించింది. కౌక్‌ మృతిని హెజ్‌బొల్లా ధ్రువీకరించింది. దీంతో గత వారం రోజుల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో హతమైన హెజ్‌బొల్లా ముఖ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది! 

హెచ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా శుక్రవారం ఇజ్రాయెల్‌ భీకర బాంబు దాడిలో మృతిచెందడం తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు కూడా మరణించారు. దాంతో హెజ్‌బొల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌక్‌ 1980ల నుంచి హెజ్‌బొల్లాలో చురుగ్గా పని చేస్తూ అగ్ర నేతగా ఎదిగారు. 2006లో దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాలో తరచుగా కనిపిస్తూ రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై అభిప్రాయాలు వెల్లడించేవారు. హెజ్‌బొల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హషీం సైఫుద్దీన్‌ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం.

జోర్డాన్‌పై మిస్సైల్‌ దాడి!    
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జోర్డాన్‌పైనా క్షిపణి దాడి జరిగింది. భారీ క్షిపణి ఒకటి బహిరంగ ప్రదేశంలో పడిపోయినట్లు జోర్డాన్‌ సైన్యం వెల్లడించింది. ఇది లెబనాన్‌ నుంచి దూసుకొచి్చనట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిసీ ఆందోళన వ్యక్తంచేశారు. 

ఇరాన్‌ గూఢచారి ఇచ్చిన పక్కా సమాచారంతోనే...! 
లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఓ భవనం కింద భారీ నేలమాళిగలో దాక్కున్న హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లాను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఇరాన్‌ గూఢచారి ఇచి్చన కచి్చతమైన సమాచారంతోనే నస్రల్లా జాడను గుర్తించినట్లు ఫ్రెంచ్‌ పత్రిక లీ పారిసీన్‌ వెల్లడించింది. అండర్‌గ్రౌండ్‌లో హెజ్‌బొల్లా సీనియర్‌ సభ్యులతో నస్రల్లా సమావేశం కాబోతున్నట్లు సదరు గూఢచారి ఇజ్రాయెల్‌కు ఉప్పందించాడని తెలిపింది. నస్రల్లా మృతిపై ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జనం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు తప్పదంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్‌ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 1980వ దశకం నుంచి హెజ్‌బొల్లాకు ఇరాన్‌ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.  

సిరియాపై అమెరికా దాడులు... 
37 మంది మిలిటెంట్లు హతం 
బీరుట్‌: సిరియాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఆదివారం 2 దఫాలుగా దాడులకు దిగింది. వీటిలో తీవ్రవాద ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు, అల్‌ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 37 మంది మిలిటెంట్లు హతమైనట్టు ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్‌ మిలిటెంట్లు ఉన్నారని వెల్లడించింది. అల్‌ ఖైదా అనుబంధ హుర్రాస్‌ అల్‌ దీన్‌ గ్రూప్‌కు చెందిన సీనియర్‌ మిలిటెంట్‌తో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వాయవ్య సిరియాపై దాడి చేసినట్లు అమెరికా æ తెలిపింది. 

సెంట్రల్‌ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్‌ శిక్షణా శిబిరంపై ఈ నెల 16న పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు సిరియా నేతలతో సహా 28 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు తమ మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్‌ సామర్థ్యాన్ని ఈ వైమానిక దాడి దెబ్బతీస్తుందని సైన్యం పేర్కొంది. 2014లో ఇరాక్, సిరియాలను చుట్టుముట్టి, పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అతివాద ఐఎస్‌ గ్రూపు తిరిగి రాకుండా నిరోధించడానికి సిరియాలో సుమారు 900 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఇవి ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్‌ గ్రూపులున్న వ్యూహాత్మక ప్రాంతాలకు కొద్ది దూరంలోనే ఉన్నాయి.  

దాడుల్లో 69 మంది మృతి  
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు పుల్‌స్టాప్‌ పడటం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ ఆదివారం చేసిన దాడులతో 69 మంది చనిపోగా 76 మంది గాయపడినట్లు లెబనాన్‌ తెలిపింది. ఒక్క బెకా లోయపై   దాడుల్లో 21 మంది మరణించగా 50 మంది వరకు గాయపడ్డారని, అయిన్‌ అల్‌ డెల్బ్‌ గ్రామంపై జరిగిన దాడిలో  24 మంది చనిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement