అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్‌ఫైర్‌ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్‌బేస్‌లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్‌గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్‌ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.
అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది.


