Iran Supreme Leader Alleges US And Israel For Anti Hijab Protests, Details Inside - Sakshi
Sakshi News home page

హిజాబ్‌ నిరసనలతో రణరంగం.. కుట్ర కోణం? ఆ రెండు దేశాల పనేనంటూ..

Published Mon, Oct 3 2022 7:09 PM

Iran Supreme Alleges Hijab Protests US Israel Conspiracy - Sakshi

టెహ్రాన్‌: హిజాబ్‌ వేసుకోలేదని మహ్‌సా అమినీ(22)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అనుమానాస్పద రీతిలో ఆ యువతి మృతి చెందడం.. ఇరాన్‌లో కార్చిచ్చును రాజేసింది. యావత్‌ ప్రపంచం తల తిప్పి చూసేలా.. అక్కడి మహిళా లోకం హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు చేపట్టింది. భద్రతా సిబ్బంది ఉక్కుపాదంతో వంద మందిని బలిగొన్న.. తగ్గేదేలే అంటూ ప్రభుత్వ వ్యతిరేక గొంతుకను వినిపిస్తోంది అక్కడి వనితాలోకం. ఇదిలా ఉంటే.. 

హిజాబ్‌ ఆందోళలనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని తొలిసారి పెదవి విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా అయతుల్లా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 83 ఏళ్ల ఇరాన్‌ సుప్రీం స్పందిస్తూ.. సంచలన ఆరోపణలకు దిగారు. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల వెనుక కుట్ర కోణం ఉందన్న ఆయన.. వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌లు ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. 

ఈ అల్లర్లకు, అభద్రతా భావానికి కారణం ఏంటో తెలిసింది. ప్రణాళికాబద్దంగా ఇరాన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే అవి అసాధారణ రీతిలో ఉంటున్నాయి. ఇందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలే కారణం. విదేశాల్లో ఉన్న కొంతమంది ఇరానియన్ల సహాయంతో, పెయిడ్‌ ఏజెంట్లతో ఈ రచ్చకు కారణం అయ్యాయి ఆ రెండు దేశాలు. 
పోలీసులు నేరస్థులకు ఎదురొడ్డి పోరాడాలి. పోలీసులపై ఎవరు దాడి చేసినా.. వాళ్ల వల్ల నేరస్థులు, దుండగులు, దొంగల నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని గుర్తించాలి. ఈ హింసాత్మక ఆందోళనలను ఖండిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు.

అలాగే.. అమినీ మృతి ఘటనపై స్పందిస్తూ.. చాలా బాధాకర ఘటన. యువతి మరణం గుండెను బద్దలు చేసింది. అయితే.. ఇది సాధారణ విషయం కాకున్నా.. కొందరు వ్యక్తులు ఎలాంటి ఆధారాలు, విచారణ లేకుండా.. ఆందోళన పేర్లతో ఇరాన్‌ వీధుల్ని రణరంగంగా మార్చేశారు. ఖురాన్‌ను తగులబెట్టారు. బలవంతంగా కొందరి హిజాబ్‌లను తొలగించారు. మసీదులకు, కార్లకు నిప్పు పెట్టారు. కాబట్టి, హిజాబ్‌ వ్యతిరేక కుట్రను గుర్తించి.. నిరసనకారులు ఆందోళన విరమించాలని సోమవారం విద్యార్థులు పాల్గొన్న ఓ కార్యక్రమం నుంచి ఆయన పిలుపు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. నిరసనలు మూడవ వారం సైతం ఉధృతంగా కొనసాగుతుండగా.. ఇరాన్ శత్రువులు కుట్రలో విఫలమయ్యారు అంటూ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement