ఇరాన్‌ ప్రతీకారం  | Iran Fires Missiles At US Bases In Kuwait And Bahrain | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ప్రతీకారం 

Jun 4 2026 5:14 AM | Updated on Jun 4 2026 6:19 AM

Iran Fires Missiles At US Bases In Kuwait And Bahrain

కువైట్, బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు  

పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్‌ సైన్యం  

కువైట్‌ ఎయిర్‌పోర్టుపై దాడిలో భారతీయుడి మృతి  

ఇరాన్‌ దుశ్చర్యను ఖండించిన భారత ప్రభుత్వం  

దుబాయ్‌: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరాన్‌ సైన్యం అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతిచెందాడు. మరికొందరు గాయపడ్డారు. మృతుడు ఏ రాష్ట్రానికి చెందినవాడనే విషయం తెలియరాలేదు. 

బాధితుడి కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమైన సాయం అందిస్తామని కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్‌ దాడిలో కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్నట్లు సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ వెల్లడించింది. కువైట్‌ ఎయిర్‌పోర్టుపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయుడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు 10 మంది భారతీయులు మరణించారు. కువైట్‌కు విమాన సేవలను గురువారం వరకు నిలిపివేస్తునట్లు భారత్‌లో ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది.  

మాటకు కట్టుబడి దాడులు చేశాం..  
బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక సైరన్‌ను మోగించినట్లు బహ్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని జనానికి సూచించింది. బహ్రెయిన్‌ గగనతలం గుండా క్షిపణులు దూసుకెళ్తున్నాయని పేర్కొంటూ ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ ‘ఎక్స్‌’లో ఒక వీడియోను పోస్టు చేసింది. ఇరాన్‌కు చెందిన ఖేష్మ్‌ ఐలాండ్‌పై ఈ నెల 2న అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. డ్రోన్‌ కార్యకలాపాలను నిర్దేశించడానికి ఉపయోగించే ఇరాన్‌ మిలటరీ గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుంది. 

ఈ దాడుల్లో ఇరాన్‌ టెలికమ్యూనికేషన్‌ యాంటెన్నా, ఆయిల్‌ ట్యాంకర్‌ ధ్వంసమైనట్లు సమాచారం. ఇందుకు ప్రతీకారంగానే ఇరాన్‌ తాజాగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఏ విధమైన దురాక్రమణకైనా భిన్నమైన, మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తాము ఇంతకుముందే హెచ్చరించినట్లు ఇరాన్‌ గుర్తుచేసింది. ఆ మాటకు కట్టుబడి నేడు దాడులు చేశామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గల్ఫ్‌ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. కువైట్, బహ్రెయిన్‌పై దాడుల్లో అమెరికాకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. అమెరికా సైన్యం స్పందించలేదు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement