డీగోపై ఇరాన్ తాజా దాడే సంకేతం
కలవరపరుస్తున్న క్షిపణి సామర్థ్యం
మూడు వారాలకు పైగా ప్రధానంగా పశ్చిమాసియాకే పరిమితమైన యుద్ధ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు కలవరపరుస్తున్నాయి. తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా–బ్రిటన్ సంయుక్త స్థావరం డీగో గార్సియాపై దాడి రక్షణ నిపుణులనే నివ్వెరపరిచింది. తద్వారా అమెరికా సైనిక స్థావరాల్లో తనకు అందరానివంటూ ఏవీ లేవని ఇరాన్ చాటిచెప్పినట్టయింది.
గార్షియా స్థావరంపైకి అది ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి విఫలం కాగా మరోదాన్ని ఎస్‌ఎం–3 ఇంటర్‌సెప్టర్‌తో కూల్చేసినట్టు అమెరికా చెబుతోంది. కాకపోతే ఇరాన్ క్షిపణుల రేంజ్, సామర్థ్యం అమెరికా ఇప్పటిదాకా భావిస్తున్న దానికంటే చాలా ఎక్కువేనని ఈ దాడితో రుజువైంది. ఇరాన్ క్షిపణుల రేంజ్ మహా అయితే 2,000 కి.మీ. మాత్రమేనని అమెరికా చెబుతూ వస్తోంది. ఇరాన్ కూడా వాటిని ఎన్నడూ ఖండించలేదు. కానీ ఆ దేశం చడీచప్పుడూ లేకుండా క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోందనేందుకు తాజా దాడులు నిదర్శనమంటున్నారు.
వ్యూహాత్మకంగా కీలకం
హిందూ మహాసముద్రం నడి»ొడ్డున ఉన్న చాగోస్ ద్వీపసమూహంలో డీగో గార్సియా అంతర్భాగం. అక్కడి 60 దీవుల్లో ఇదే అతి పెద్దది. 1960ల్లో ఇక్కడి 2,000 పై చిలుకు మూలవాసులను బ్రిటన్ బలవంతంగా ఖాళీ చేయించింది. 1971 నుంచీ ఈ దీవి అమెరికాకు అతి కీలక సైనిక స్థావరంగా మారింది. అప్పట్లో వియత్నాం మొదలుకుని అనంతర కాలంలో ఇరాక్, అఫ్గానిస్తాన్‌పై అమెరికా సాగించిన యుద్ధాల్లో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి దేశమైన చైనా కార్యకలాపాలపై నిశితమైన నిఘాకు కూడా అగ్ర రాజ్యానికి వీలు కలి్పస్తూ వస్తోంది.
ప్రస్తుతం ఈ దీవిలో మోహరించిన 2,500 మంది సైనికుల్లో అత్యధికులు అమెరికన్లే. భారీ బాంబర్లు, నిఘా విమానాలతో పాటు కీలకమైన సైనిక మౌలిక సదుపాయాలన్నీ డీగో సొంతం. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన బీ–2 స్పిరిట్ బాంబర్ యుద్ధ విమానాలను కూడా గతేడాది ఆ దీవిలో అమెరికా మోహరించింది. ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో అక్కడ అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించడం కూడా తప్పేలా లేదు. అదే జరిగితే అమెరికాకు ఇప్పటికే తడిసిమోపెడవుతున్న యుద్ధ వ్యయం మరింత పెరగడం ఖాయం.
ఈ కోణం నుంచి చూస్తే ఇరాన్ దాడి ప్రాధాన్యం సంతరించుకుందన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ‘‘శనివారం నాటి దాడి ద్వారా యుద్ధక్షేత్రాన్ని గల్ఫ్ నుంచి హిందూ మహాసముద్రానికి విస్తరించడంలో ఇరాన్ సఫలమైంది. అంతేకాదు, దక్షిణ యూరప్ దాకా ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం తనకు సమకూరిందంటూ హెచ్చరిక సంకేతాలు పంపింది’’అని వారంటున్నారు. తాజా యుద్ధానికి సంబంధించి హిందూ మహాసముద్రంలో జరిగిన రెండో ఘటనగా ఇరాన్ క్షిపణి దాడులు నిలిచాయి. ఆ దేశ యుద్ధ నౌక ఐఆర్‌ఐఎస్ దేనాను శ్రీలంక తీర సమీపంలోని సముద్ర జలాల్లో జలాంతర్గామి దాడి ద్వారా అమెరికా ముంచేయడం తెలిసిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్


