IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం

IPCC: Countries most affected by Climate Change - Sakshi

నిజమవుతున్న ఐరాస ప్యానల్‌ అంచనాలు

వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు  తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్‌ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి.  
► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి!
► ఫిలిప్పీన్స్‌దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి.
► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది.  
► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  

కారణాలెన్నో...!
గ్లోబల్‌ వార్మింగ్‌ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్‌                డయాక్సైడ్‌ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది.  

నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్‌లో ఆగస్ట్‌ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top