కోవిడ్‌ టీకా పొందనున్న తొలి భారత సంతతి వ్యక్తి

Indian Origin Hari Shukla First to Get Coronavirus Vaccine in UK - Sakshi

యూకేలో నేటి నుంచి ఫైజర్‌-బయోఎన్‌ టెక్‌ అత్యవసర వినియోగం

లండన్‌: భారత సంతతి వ్యక్తి  హరి శుక్లా అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మొదటి వ్యక్తుల జాబితాలో చేరారు. ఈ రోజు ఆయన యూకేలోని ఓ ఆస్పత్రిలో ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ని తీసుకోబోతున్నారు. ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటీష్‌ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత 80 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌ వర్కర్స్‌కి, హోం కేర్‌ వర్కర్స్‌కి వ్యాక్సిన్‌ వేస్తారు. ఈ సందర్బంగా హరి శుక్లా మాట్లాడుతూ.. ‘ఇప్పటికైనా మహమ్మారి కట్టడికి ఓ ఆయుధం రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ పొందిన మొదటి వ్యక్తుల జాబితాలో చేరడం ఉద్వేగానికి గురి చేస్తోంది. నాకు కాల్‌ చేసి వ్యాక్సిన్‌ తీసుకునే వారి జాబితాలో నా పేరు ఉందని చెప్పినప్పటి నుంచి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. కోవిడ్‌ సంక్షోభం ముగింపుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి అయ్యింది అనే విషయం తలుచుకుంటే ఎంతో ఊరటగా ఉంది’ అన్నారు హరి శుక్లా. (చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!)

ఇక బ్రిటన్‌లో అత్యవసర వినియోగంలో భాగంగా మొదటి వారంలో 8 లక్షల డోసుల వ్యాక్సిన్‌లని అందుబాటులోని తీసుకురానున్నారు. కోవిడ్‌ వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి, 80ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్‌ జన్సాన్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై పొరాటంలో యూకే నేడు అతి పెద్ద ముందడుగు వేయబోతుంది. దేశంలో మొదటి సారిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ని వేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు, ట్రయల్స్‌ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జనాలను చూసి నేను గర్వ పడుతున్నాను’ అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top