‘మా కుటుంబం కన్నీళ్లు కారుస్తూనే ఉంది’

Indian Origin Family Car Dealership Set Ablaze By Rioters in US - Sakshi

కార్ల డీలర్‌షిప్‌నకు నిప్పు.. 2.5 మిలియన్‌ డాలర్ల నష్టం

‘‘కళ్లముందే అంతా కాలి బూడిదైపోతున్నా చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరూ ఏమీ చేయలేపోయారు. ఆరు కార్లతో మొదలుపెట్టి నేడు 100 కార్ల వరకు డీలర్‌షిప్‌ తీసుకునే స్థాయికి చేరుకున్నాం. ఒక్కోమెట్టు ఎక్కుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. మేము కూడా మైనార్టీలమే. మాకు అసలు దీనితో సంబంధం లేదు. ఏం తప్పు చేశామో అర్థం కావడం లేదు. అయినా మాకే ఎందుకు ఇలా జరిగింది? గత కొన్ని రోజులుగా నా కుటుంబం కన్నీళ్లు కారుస్తూనే ఉంది’’ అంటూ భారత సంతతికి చెందిన, కెనోషా నివాసి అన్మోల్‌ ఖింద్రీ అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

తన పూర్వీకులు వలస వచ్చిన నాటి అమెరికా ఇది కాదని, అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని తాను కనీసం ఊహించలేకపోయానని ఉద్వేగానికి లోనయ్యారు. తమ కార్ల డీలర్‌షిప్‌ ప్లేస్‌కు నిరసనకారులు నిప్పంటించడంతో భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు శనివారం స్థానిక మీడియాకు తెలిపారు. 100 వాహనాలు కాలి బూడిదయ్యాయని ఆవేదన చెందారు. పెట్రోలు బంకులు, రెస్టారెంట్లలో పనిచేసిన తమ పూర్వీకుల కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయిందని భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: ‘ఇండియన్లు, చైనీయులు దేశం విడిచి వెళ్లిపోండి’)

కాగా ఆఫ్రో- అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విన్‌కొన్సిన్‌ రాష్ట్రంలోని కెనోషాలో కూడా ఆగష్టు 23న ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాకోబ్‌ బ్లేక్‌ అనే 27 ఏళ్ల నల్ల జాతీయుడిని పోలీసులు చుట్టుముట్టి కాల్చేసిన ఘటన నిరసనలకు దారి తీసింది. దీంతో అతడికి న్యాయం జరగాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన కుటుంబ కార్ల షాపునకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఫైరింజన్‌కు ఫోన్‌ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఘటనాస్థలికి పొరుగున నివసించే జోసీ రోడ్రిగెజ్‌ అనే మహిళ స్థానిక మీడియాకు తెలిపారు. తాను ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌ చేశానని, అయినా అటు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని, ఫైర్‌ఫైటర్లను అక్కడకు పంపించడం సురక్షితం కాదని సమాధానం వచ్చినట్లు పేర్కొన్నారు. (చదవండి: ‘ఆ పదవికి హారిస్‌ కన్నా ఇవాంకనే ఉత్తమం’)

ఇక ఈ ఘటనలో బాధిత కుటుంబానికి 2.5 మిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు కెనోష్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు గో ఫండ్‌ మీ పేజ్‌ ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకీ జాత్యహంకార దాడులు పెరిగిపోతుండటంతో వలసదారులు భయాందోళనలకు గురవుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా (డెమొక్రటిక్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ను ఉద్దేశించి)జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం ఇలాంటి ఘటనలను మరింత ప్రోత్సాహమిచ్చేలా ఉందని వాపోతున్నారు.

కాగా ఆగష్టు 23 నాటి ఘటనపై స్పందించిన ట్రంప్‌.. ‘‘రెండు రోజుల క్రితం జాతీయ భద్రతా దళాలను విన్‌కోన్సిన్‌కు తరలించాం. అప్పటి నుంచి ఎలాంటి హింస చోటుచేసుకోలేదు. చిన్న సమస్య కూడా తలెత్తలేదు’’ అని ఆగష్టు 28న ట్వీట్‌ చేశారు. జాకోబ్‌ బ్లేక్‌ ఉదంతంపై తీవ్ర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కెనోషీలో పర్యటించి అల్లర్ల కారణంగా సంభవించిన నష్టం గురించి అధికారులతో చర్చించేందుకు మంగళవారం షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు.

అయితే రాష్ట్ర గవర్నర్‌, డెమొక్రటిక్‌ పార్టీ నేత టోనీ ఎవర్స్‌ మాత్రం సమస్యాత్మక ప్రాంతానికి రావొద్దని, అధ్యక్షుడి రాక కారణంగా దిద్దుబాటు చర్యలు మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్రంప్‌నకు లేఖ రాసినట్లు సమాచారం. ఇక డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి సైతం సోమవారం అక్కడ పర్యటించాలని భావించారు. అయితే చివరి నిమిషంలో పెన్సిల్వేనియాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడం గమనార్హం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top