
వాషింగ్టన్: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చేశారు. అమెరికా-ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం మార్గంలోనే భారత్ పయనిస్తున్నదని అన్నారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు లేదా ఏకపక్ష సుంకాలను ఎదుర్కోనేందుకు ట్రంప్ నిర్ణయించిన ఆగస్టు ఒకటి గడువుకు ముందే దీనిపై భారత్- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఇండోనేషియాతో తాను ప్రకటించిన వాణిజ్య ఒప్పందం మాదిరిగనే భారత్ కూడా ఇదే మార్గంలో పనిచేస్తున్నదని, ఇది అమెరికా, భారత మార్కెట్‌లకు అత్యధిక లబ్ధి చేకూరుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా- ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోకి దిగుమతులపై 19 శాతం సుంకం ఉంటుంది. అయితే అమెరికా నుండి ఇండోనేషియాకు ఎగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రకటించారు. భారత్ కూడా ఇదే మార్గంలో పనిచేస్తోందని, భారత్‌తో ఇదే విధమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామన్నారు.
ఆగస్టు 1 నాటికి ఒప్పందం కుదుర్చుకోకపోతే 35 శాతం వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ యూరోపియన్ యూనియన్‌కు లేఖలు పంపారు. అమెరికా- భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఒకవేళ ఇండోనేషియా ఒప్పందాన్ని ప్రతిబింబిస్తే, భారతదేశ ఎగుమతులపై 19 శాతం సుంకం ఉండనుంది అలాగే యూఎస్ నుండి దిగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని తెలుస్తోంది.