
వాషింగ్టన్ సీడీసీ: భారత ప్రధాని మోదీ తరచూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ, ఆయా దేశాలతో భారత్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తుంటారు. అలాగే వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంటుంటారు. ఈ నేపధ్యంలో ఆయా దేశాల అధిపతుల అభినందనలు అందుకుంటుంటారు. ప్రధాని మోదీ తాజాగా అమెరికా నుంచి అభినందనలు అందుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీతో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. శ్వేతసౌధం వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మిత్రదేశంగా భారతదేశం నిర్వహిస్తున్న పాత్రను ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య బలమైన సంబంధం ఉందని కూడా అన్నారు.
భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. గత వారమే భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఈ విషయమై తాను అమెరికా వాణిజ్య కార్యదర్శితో మాట్లాడానని, ఆయన అధ్యక్షుడు ట్రంప్‌తో ఇదేవిషమై సమాలోచనలు జరుపుతున్నారన్నారు. ఈ ఒప్పందాలను ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని, త్వరలోనే అమెరికా వాణిజ్య బృందం దీనికి సంబంధించిన ప్రకటన వెలువరుస్తుందన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న తరుణంలో అమెరికా ఈ వివరాలు తెలిపింది.
ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న ‘క్వాడ్’(క్యూయూఏడీ) సదస్సులో పాల్గొన్న జైశంకర్ తొలుత ‘ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ అనే ప్రదర్శనను ప్రారంభించారు. ఉగ్రవాదంపై పోరాడాల్సిన ఆవశ్యతను ప్రపంచదేశాలకు తెలియజేసే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నారు. క్వాడ్ అనేది ఆస్ట్రేలియా, భారత్, జపాన్ , యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన దౌత్య భాగస్వామ్యం. ఇది ఇండో-పసిఫిక్‌కు మద్దతు పలికేందుకు ఉద్దేశించినది. ఈ గ్రూపు 2004 డిసెంబరులో సంభవించిన హిందూ మహాసముద్ర సునామీ సమయంలో ఈ దేశాలు పరస్పరం మానవతా దృక్ఫధాన్ని చాటేందుకు ఏర్పాటయ్యింది.
ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?