ఒంటి చేత్తో యుద్ధం ఆపేశా  | I Stopped Nuclear War Between India and Pakistan War Says Donald Trump | Sakshi
Sakshi News home page

ఒంటి చేత్తో యుద్ధం ఆపేశా 

Jun 29 2025 1:06 AM | Updated on Jun 29 2025 1:06 AM

I Stopped Nuclear War Between India and Pakistan War Says Donald Trump

ట్రంప్‌ నోట మళ్లీ అదే మాట! 

వాషింగ్టన్‌:  భారత్, పాకిస్తాన్‌ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడగా, తానే చొరవ తీసుకొని ఒంటిచేత్తో ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. అన్ని రకాల వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని హెచ్చరించడంతో ఈ రెండు దేశాలు తన మాట విని దారికొచ్చాయని, యుద్ధం ఆపేశాయని చెప్పారు. ట్రంప్‌ తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్‌ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత తన సీనియర్‌ అధికారులను రంగంలోకి దించానని, ఇరుదేశాలను ఒత్తిడి పెంచానని తెలిపారు. 

తన చాతుర్యం ఫలించి యుద్ధం ఆగిపోయిందని వెల్లడించారు. తానే కనుక చొరవ తీసుకోకపోత రెండు దేశాల మధ్య కచ్చితంగా అణు యుద్ధం జరిగేదని స్పష్టంచేశారు. తనలాగా గొప్ప పని చేసిన అమెరికా అధ్యక్షుడు గతంలో మరొకరు ఉన్నారో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మధ్య కాల్పుల విరమణకు భారత్, పాక్‌లను ఒప్పించడం ద్వారా గొప్ప పని చేశానని అన్నారు. 

సెర్బియా, కొసావో దేశాలను సైతం ఇలాంటి దారికి తీసుకొచ్చానని, అక్కడ పెద్ద యుద్ధం ఆపేశానని ట్రంప్‌ ఉద్ఘాటించారు. వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటానని బెదిరించడంతో అవి ఘర్షణకు స్వస్తి చెప్పి, శాంతిని ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో మంచి నాయకులు ఉన్నారని, వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అమెరికాతో వాణిజ్యం కావాలా? లేక ఒకరిపై ఒకరు అణు బాంబులతో దాడులు చేసుకుంటారా? అని ప్రశ్నించగా, వాణిజ్యమే కావాలని బదులిచ్చారని వివరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement