యూరోపా యాత్రకు లైన్‌క్లియర్‌!

Hubble finds evidence of water vapour on Jupiter moon Ganymede - Sakshi

అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది... గురుగ్రహ ఉపగ్రహం యూరోపాపైకి నాసా ప్రయోగించనున్న... యూరోపా క్లిప్పర్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌లైట్‌ పడింది. ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్‌ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే లక్ష్యం!

భూమికి ఆవల మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్నది తెలుసుకునేందుకు చాలాకాలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌర కుటుంబానికి ఆవల వేల సంఖ్యలో గ్రహాలను ఇప్పటికే గుర్తించినప్పటికీ ఈ ఎక్సోప్లానెట్లలో జీవం ఆనవాళ్లు కానీ.. జీవించేందుకు అనువైన పరిస్థితులు కానీ ఇప్పటివరకూ గుర్తించ లేదు. సూర్యుడికి (ఇతర గ్రహ వ్యవస్థల్లోనైతే మాతృ నక్షత్రం) తగినంత దూరంలో ఉండటం.. భూమితో సరిపోలేలా రాళ్లు రప్పలతో, నీళ్లతో ఉండటం జీవం ఉండేందుకు అత్యవసరమన్నది శాస్త్రవేత్తల అంచనా.

ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని గోల్డీలాక్స్‌ జోన్‌ అని పిలుస్తుంటారు. సౌర కుటుంబంలోని గురు గ్రహానికి ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపా కొంచెం అటు ఇటుగా ఈ గోల్డీలాక్స్‌ జోన్‌లోనే ఉంది. పైగా ఆ ఉపగ్రహంలో మహా సముద్రాలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యూరోపా చుట్టూ చక్కర్లు కొడుతూ దాన్ని మరింత నిశితంగా పరిశీలించేందుకు జరుగుతున్న యూరోపా క్లిప్పర్‌ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఆ వివరాలు...  
1610లో గెలీలియో గురుగ్రహం వైపు తన దుర్భిణిని మళ్లించి చూసినప్పుడు అతడికి గ్రహంతోపాటు వెలుగులు చిమ్ముతున్న నాలుగు చుక్కల్లాంటివి కనిపించాయి. గురుగ్రహానికి ఉన్న 67 ఉపగ్రహాల్లో అతిపెద్దవైన నాలుగు ఉపగ్రహాలివి. వీటిల్లో అతి చిన్నది యూరోపా! నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిప్పర్‌ కంటే ముందు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ 2022లోనే జూపిటర్‌ ఐసీమూన్‌ ఎక్స్‌ప్లోరర్‌ లేదా జ్యూస్‌ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించనుంది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకూ ప్రణాళికలు ఉన్నాయి!     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top