
గబ్బిలాల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వైరస్
పెరుగుతున్న హెచ్‌కేయూ 5–కోవ్–2 కేసులు
బీజింగ్: ఐదేళ్ల క్రితం కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా! చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి హెచ్‌కేయూ5–కోవ్–2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరి, మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా, అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి.
ఇవి హెచ్‌కేయూ5–కోవ్–2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నాయి. గాంగ్‌జౌ లేబోరేటరీ, గాంగ్‌జౌ అకాడమీ అఫ్ సైన్సెస్, వూహాన్ యూనివర్సిటీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
ఐదేళ్ల క్రితం సార్స్–కోవ్–2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్–కోవర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ2) అనే రిసెప్టర్‌ను ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్–19 పంజా విసరింది. గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్–19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.