సాక్షి, లండన్: బ్రిటన్‌లో దారుణం జరిగింది. 26 సంవత్సరాలున్న గుర్బేజ్ సింగ్ అనే ఓ భారతీయ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. అయితే అతనిని చంపడానికి గల కారణాలేంటో ఇంకా తెలియలేదు. కాగా అతని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి అక్కడి భారతీయులు విరాళల సేకరణ చేపడుతున్నారు.
పశ్చిమ లండన్‌లోని సౌత్ఆల్ ప్రాంతంలో తీవ్రమైన కత్తిపోట్ల దాడిలో 26 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో మరణించిన యువకుడిని గురభేజ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. డార్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ సమీపంలోని నార్త్ రోడ్డుపై ఆయనపై ఈ దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో 30 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నారని అతనని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ హత్యకు సంబంధించి ఘటనా స్థలంలోనే 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు పురుషులను పోలీసులు అనుమానితులుగా అరెస్ట్ చేశారు. అయితే, తదుపరి విచారణ తర్వాత వారిలో ఆరుగురిని ఎలాంటి కేసు లేకుండా విడుదల చేయగా, ఒకరికి మాత్రం బెయిల్ మంజూరు చేశారు. అతను తదుపరి తేదీలో విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ దారుణ ఘటన తర్వాత, గురభేజ్ సింగ్ భౌతికకాయాన్ని తిరిగి స్వదేశానికి రప్పించడానికి డాక్యుమెంటేషన్, రవాణా, అంత్యక్రియల ఏర్పాట్లు మరియు ఇతర ఖర్చుల కోసం Go Fund Me వెబ్‌సైట్‌లో ఒక విరాళాల ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం 16,000 యూరోల లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 737 మంది దాతల నుండి 11,114 యూరోల నిధులు సేకరించారు.


