ఇరాన్‌పై గల్ఫ్ దేశాల ఆందోళన
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
తీవ్ర రేడియేషన్ ముప్పు
సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్‌డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి.
సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే!
తయారీ సులభమా?
అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్‌లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


