పని మనిషి కాస్త.. ఓనర్‌ అయ్యింది! | Great Daughter Full Fill Mother Dream Buys Home Which She Working | Sakshi
Sakshi News home page

విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్‌!

Nov 5 2022 3:42 PM | Updated on Nov 5 2022 4:06 PM

Great Daughter Full Fill Mother Dream Buys Home Which She Working - Sakshi

తల్లిదండ్రులు చేసే త్యాగాలను గుర్తించడం బిడ్డల బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించిన ఓ కూతురు..

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. దాని వెనుక బోలెడంత కథాకమీషు ఉంటుంది. అయితే అనుకున్న దానిని నెరవేర్చుకునేందుకు కొందరు పడే తాపత్రయం.. ఆకట్టుకోవడమే కాదు, వాళ్ల లక్ష్యసాధన చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది కూడా. ఒకప్పుడు ఆమె ఆ విలాసవంతమైన ఇంట్లో పని మనిషి. ఇల్లు ఊడ్చి.. తుడిచి.. ఇంటి పనులు చేసేది. కాలచక్రం గిర్రున తిరిగి 43 ఏళ్లు గడిచింది. అదే ఇంట్లో ఇప్పుడామె ఓనర్‌గా దర్జాగా కాలు మీద కాలేసి కూర్చుంది!. 

న్యూమెక్సికో అల్బుకెర్కీకి చెందిన మార్గరెట్‌ గాక్సియోలా.. 1976లో 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైంది. అయితే భర్త ఆమెను వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఓ పూల షాపులో పని చేస్తూనే.. నాలుగు ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో చిన్నకూతురు నికోల్‌ను వెంటపెట్టుకుని వెళ్లేది. అయితే అన్నింట్లోకి ఆమెకు ఒక ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉండేది.

ఆ ఇల్లు చాలా విలాసవంతమైంది కావడమే అందుకు కారణం. తన పూర్తి జీవితం అందులోనే గడిపితే బాగుండేదని తరచూ గాక్సియోలా పిల్లలతో చెబుతూ ఉండేదట. కానీ, అది సాధ్యం కానీ అంశమని ఆమెకు కూడా తెలుసు!. ఇక నికోల్‌కు కూడా ఆ ఇంట్లో ఎంతో నచ్చింది. ఓ టేబుల్‌ కింద కూర్చుని ఎక్కువ సేపు ఆడుకునేది. ఆ ఇల్లు గాక్సియోలా ఉండే చిన్ని అద్దెయింటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉండేది. ఇక ఇంటి ఓనర్‌ పమేలా కీ లిండెన్‌ కూడా ఈ తల్లీబిడ్డలను సొంతవాళ్లుగా భావించేది. అలా చాలా ఏళ్లు గడిచాయి. 2018లో పమేలా అనారోగ్యంతో చనిపోయాక.. గాక్సియోలా ఆ ఇంటి పనులకు వెళ్లడం మానేసింది.

ఈలోపు తన ముగ్గురు పిల్లలు మంచి చదువులతో.. మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు కొడుకులు భార్యాపిల్లలతో సుఖంగా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. గాక్సియోలా మాత్రం ఒంటరిగా ఆ చిన్ని అద్దె ఇంట్లోనూ ఉంటూ వచ్చింది. అయితే తన తల్లి మనసును అర్థం చేసుకుంది కూతురు నికోల్‌ నారంజో(44). పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా.. తన తల్లి కలను నెరవేర్చేందుకు ప్రయత్నించింది. 

భర్త సాయంతో.. తానూ ఉద్యోగం చేస్తూ డబ్బును కూడబెడుతూ వచ్చింది. తమ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి.. వెలకట్టలేని బహుమతిని అందించాలనుకుంది. నవంబర్‌ 2020లో ఆ ఇల్లును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు.. ఆ ఇంటిని కొనుగోలు చేసి.. ఈ మధ్యే ఆ ఇంట్లో తల్లిని అడుగుపెట్టించింది. కోరుకున్న కలను కళ్ల ముందు ఉంచిన బిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. ఆ క్షణాలను భావోద్వేగంగా మల్చుకుంది ఆ తల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement