గూగుల్‌పై కంటెంట్‌ చోరీ ఆరోపణలు

Google And Facebook Took Sharpest Jabs From Democrats And Republicans - Sakshi

ప్రతినిధుల ఆరోపణలపై పిచాయ్‌ వివరణ

వాషింగ్టన్‌ : గూగుల్‌, ఫేస్‌బుక్‌లు తమ మార్కెట్‌ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి టెక్‌ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. అమెరికన్‌ కాంగ్రెస్‌లో జ్యుడిషియరీ కమిటీ ఎదుట బుధవారం విచారణకు హాజరైన గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌, అమెజాన్‌ సీఈఓలను సెనేటర్లు నిలదీసినంత పనిచేశారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి మార్కెట్‌ విలువను కలిగిన ఈ దిగ్గజాలు మార్కెట్‌ వాటా కోసం చిన్న సంస్ధలను దారుణంగా నలిపేస్తున్నాయని యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు టెక్‌ సీఈఓలు మార్క్‌ జుకర్‌బర్గ్‌, జెఫ్‌ బెజోస్‌, టిమ్‌ కుక్‌, సుందర్‌ పిచాయ్‌లను కడిగేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణలో దిగ్గజ సిఈఓలను ప్రతినిధులు తమ పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈఓకు ప్రతినిధుల నుంచి తీవ్ర ఆరోపణలు, ప్రశ్నలు ఎదురవగా వీటన్నింటినీ సమీక్షించి తిరిగి సభకు వివరిస్తానని పిచాయ్‌ వివరణ ఇచ్చారు. గూగుల్‌ కంటెంట్‌ చోరీకి పాల్పడుతోందని డెమొక్రాట్‌, యాంటీ ట్రస్ట్‌ సబ్‌కమిటీ చీఫ్‌ డేవిడ్‌ సిసిలిన్‌ సుందర్‌ పిచాయ్‌ను నిలదీశారు. యెల్ప్‌ ఇంక్‌ నుంచి గూగుల్‌ రివ్యూలను దొంగిలిస్తోందని, దీన్ని ఆక్షేపిస్తే సెర్చి రిజల్ట్స్‌ నుంచి యెల్ప్‌ను డీలిస్ట్‌ చేస్తామని గూగుల్‌ బెదిరిస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల గురించి నిర్ధిష్టంగా తాను తెలుసుకోవాలనుకుంటున్నానని పిచాయ్‌ బదులిచ్చారు. చదవండి : సుందర్‌ పిచాయ్‌: ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ

యూజర్ల కోసం గూగుల్‌ కంటెంట్‌ చోరీకి పాల్పడుతుందనే ఆరోపణలతో తాను ఏకీభవించనన్నారు. ఇక 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడంపై ఎఫ్‌బీ చీఫ్‌ జుకర్‌బర్గ్‌ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ పెనుముప్పుగా మారుతుందనే ఆందోళనతోనే దాన్ని కొనుగోలు చేశారా అని ప్రతినిధులు జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. తాము ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలుచేసిన సమయంలో అది ఓ చిన్న ఫోటో షేరింగ్‌ యాప్‌ మాత్రమేనని జుకర్‌బర్గ్‌ బదులిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ సమీక్షించిందని గుర్తుచేశారు. ఫేస్‌బుక్‌ తన ప్రత్యర్ధులను ఏయే సందర్భాల్లో అనుకరించిందని మరో ప్రతినిధి ప్రమీలా జయపాల్‌ జుకర్‌బర్గ్‌ను అడగ్గా ఇతరుల ముందుకెళ్లిన ఫీచర్లు కొన్నింటిని తాము అనుసరించిన సందర్భాలున్నాయని అంగీకరించారు. నలుగురు దిగ్గజ టెక్‌ అధినేతలు ఒకేసారి చట్టసభ సభ్యుల ముందు విచారణకు హాజరవడం ఇదే తొలిసారి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top