'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్ | Global Economy at Risk IMF Warns Amid Iran US Conflict | Sakshi
Sakshi News home page

'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్

Apr 15 2026 1:26 AM | Updated on Apr 15 2026 1:33 AM

Global Economy at Risk IMF Warns Amid Iran US Conflict

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఐఎంఎఫ్ విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి సుమారు 3.1 శాతంగా ఉంటుంది పేర్కొంది. జనవరిలో ఇది 3.3 శాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారాయి.

ఈ యుద్ధం ఇరాన్ - అమెరికా,ఇజ్రాయెల్ దాడుల మధ్య ఉద్రిక్తతలతో ప్రారంభమై.. ఆ ప్రాంతంలో తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాల కారణంగా ముఖ్యంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాను అడ్డుకోవడం వల్ల ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదలతో.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం.. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరవచ్చని అంచనా. ఇది జనవరిలో చెప్పిన అంచనాల కంటే చాలా ఎక్కువ.

అయితే.. 1970లలో జరిగిన చమురు సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా చమురు మీద ఆధారపడటం తగ్గింది. పునరుత్పాదక శక్తి, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరంగా నిలబడే అవకాశం ఉంది.

యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. అప్పుడు గ్లోబల్ వృద్ధి రేటు 2.5 శాతం లేదా 2 శాతానికి కూడా పడిపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలపై సమానంగా ఉండదని ఐఎంఎఫ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: భారత్‌కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!

మధ్యప్రాచ్యం - మధ్య ఆసియా ప్రాంతాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గి 1.9 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కూడా ప్రభావితమవుతున్నాయి. అమెరికా వృద్ధి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, చైనాలో వృద్ధి కొంచెం మందగించనుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement