Fumio Kishida: చిరకాల స్వప్నం సాకారం.. జపాన్‌ కొత్త ప్రధానిగా

Fumio Kishida Replaced Yoshihide Suga As Japan PM - Sakshi

జపాన్‌ కొత్త ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా

టోక్యో: మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా జ‌పాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీక‌రించనున్నారు. 64 ఏళ్ల  ఫుమియో కిషిడా ఆ దేశ అధికార పార్టీ నేత‌గా తాజాగా ఎన్నిక‌య్యారు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో ఫుమియో బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రముఖ టీకా చీఫ్ టారో కోనోను ఓడించి మరీ తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు ఫుమియో. అధికారిక పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లురాగా, కోనోకు 170 ఓట్లు పోల్‌ అయ్యాయి. 

గత రెండు దశాబ్దాలుగా జపాన్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలనుంచి వైదొలగాలని, దేశంలో ఆదాయ అసమానతలను అధిగమిస్తామని ఆయన వాగ్దానం చేశారు.  అంతేకాదు మహమ్మారినుంచి బయటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని కూడా కిషిడా హామీ ఇచ్చారు.

కిషిడా హిరోషిమా రాజకీయ నాయకుల కుటుంబానికి చెందిన మృదు భాషి. బేస్ బాల్‌ అంటే ఇష్టం.  గతంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. అలాగే 2012-17 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఈ సమయంలో రష్యా ,దక్షిణ కొరియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు అణ్వాయుధాలను రద్దు చేయడమే తన జీవితాశయమని ప్రకటించారు.  ఈ నేపథ్యంలో 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమా చారిత్రాత్మక పర్యటనకు దోహదపడ్డారు.

కాగా కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, దేశాన్ని న‌డిపించ‌లేక‌పోతున్నట్టు ఇటీవ‌ల ప్రస్తుత ప్రధాని సుగా ప్రకటించిన నేపథ్యంలో కొత్త ఎన్నిక అనివార్యమైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top