అమ్మ గర్భంలో ఐదేళ్లు.. ఆయుష్షు వందేళ్లు..

France Scientists Reveal Interesting Facts About Coelacanth Fish - Sakshi

భూమ్మీద జంతువులకు మూలం ఈ చేపలే!

మనకు చాలా రకాల చేపలు తెలుసు. చివరికి షార్కులు, తిమింగలాలు కూడా తెలుసు. కానీ వాటన్నింటికన్నా చిత్రమైన, అతి ఎక్కువ కాలం బతికే ఓ చేప ఉంది తెలుసా? అదే డైనోసార్ల కాలం నాటి ‘సీలూకంత్‌’ చేప. లక్షల సంవత్సరాలుగా దాని రూపం, లక్షణాల్లో ఎలాంటి మార్పులూ జరగకుండా ఉండిపోయిన ఈ జాతి చేపలు ఎప్పుడో అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు భావించారు. కానీ 1938లో దక్షిణాఫ్రికా తీరంలో ఈ చేపను గుర్తించారు. 1998లో తొలిసారిగా సజీవంగా పట్టుకోగలిగారు. ఇటీవల మరో ‘సీలూకంత్‌’ చేప దొరకడంతో ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకుందామా? 

చేపల జాతికి చెందిన జీవుల్లో.. భూమ్మీదే అతిపెద్ద జీవి అయిన నీలి తిమింగలం 70 నుంచి 90 ఏళ్లు బతుకుతుంది. కానీ సీలూకంత్‌ చేప వందేళ్లకుపైగా బతుకుతుంది. అసలు ఈ చేప తల్లికడుపులోనే ఐదేళ్లు ఉంటుంది. 50 ఏళ్ల వయసు వచ్చాకే పిల్లల్ని కనడం మొదలుపెడ్తుంది. చర్మంపై చాలా గట్టి, మందమైన రక్షణ పొర ఉంటుంది. సముద్రంలో 2,300 అడుగుల లోతున జీవిస్తుంది. చాలా మెల్లగా గరిష్టంగా రెండు మీటర్ల పొడవు, వంద కిలోల బరువు వరకు పెరుగుతుంది. ఇటీవల దొరికిన సీలూకంత్‌ చేపపై పరిశోధన చేసిన ఫ్రాన్స్‌ మెరైన్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు.. దాని వయసు 84 ఏళ్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్రికా ఖండం తూర్పుతీరంలోని కొమొరోస్‌ దీవుల్లో, ఇండోనేషియాలోని సులవేసి దీవుల్లో మాత్రమే ఈ చేపలు ఉన్నట్టు చెప్తున్నారు. 

పగలంతా గుహల్లో.. రాత్రి వేట 
ఈ చేపలు సముద్రాల అడుగున గుహల్లో జీవిస్తాయి. పగలంతా నిద్రపోయి.. రాత్రిళ్లు వేటాడు తాయి. ఇకఇంత పెద్ద చేపలు అయినా.. వాటి మెద డు చాలా చిన్నగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చేప తలలో మెదడు ఉండే ప్రాంతం (క్రానియల్‌ కావిటీ)లో కేవలం ఒకటిన్నర శాతమే మెదడు ఉంటుందని, మిగతా భాగం కొవ్వుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. ఈ చేపల శరీరం నిండా ఆయిల్, యూరియా, జిగురు వంటి పదార్థాలతో ఒక రకమైన దుర్వాసన వస్తుందని.. సముద్రంలోని ఇతర జీవులు దీని జోలికి రావని అంటున్నారు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

బతికున్న శిలాజాలు 
లక్షల ఏళ్లనుంచి మార్పు లేకుండా ఉండటంతో ఈ చేపలను ‘బతికున్న శిలాజాలు’గా పేర్కొంటూ ఉంటారు. సాధారణంగా అన్ని చేపలకు ఈదడానికి రెండు పెద్ద రెక్కలు ఉంటే.. సీలూకంత్‌ చేపలకు నాలుగు పెద్ద రెక్కలు ఉంటాయి. భూమ్మీద జంతువులకు నాలుగు కాళ్లు ఉన్నట్టుగా వీటికి ఉన్న నాలుగు రెక్కలు పని చేస్తున్నాయని.. వాటి కదలిక కూడా నడక తరహాలోనే ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదట్లో సముద్రాల్లో పుట్టిన జీవం భూమిపై బతికేలా మారే క్రమంలో ‘సీలూకంత్‌’ చేపలు ఒక భాగమని వివరిస్తున్నారు. ఈ చేపలకు మొత్తంగానే వెన్నెముక లేదు. దాని స్థానంలో ఆయిల్‌ నిండిన ఒక ట్యూబ్‌ (గొట్టం) లాంటి నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు. తీవ్ర ఒత్తిడితో ఆయిల్‌ నిండి ఉన్న ఈ ట్యూబ్‌ దానికి వెన్నెముకగా పనిచేస్తుందని తేల్చారు.  

చదవండి: వైరల్‌ తూకిత్తా .. మైకిత్తా.. అంటున్న చేపలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top