ప్రాణాలు తీస్తున్న ప్లాస్టికోసిస్‌ వ్యాధి.. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను హరిస్తోంది

For the first time it was recognized as a disease caused by plastic waste - Sakshi

సాక్షి, అమరావతి: మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్‌.. సముద్ర పక్షులను సైతం పొట్టన పెట్టుకుంటోంది. సముద్ర జలాల్లోకి చేరుతున్న చిన్నచిన్న ప్లాస్టిక్‌ ముక్కలను ఆహారంగా భావించి తింటున్న పక్షులు మూకుమ్మడిగా మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇటీవల ఆస్ట్రేలియా సమీపంలోని లార్డ్‌ హోవ్‌ ద్వీపంలో బ్రౌన్‌ సీగల్స్‌పై అధ్యయనం చేసి.. మరణించిన పక్షుల శరీరాలను పరీక్షించగా కడుపులో ప్రమాదకరమైన స్థాయిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నట్టు తేలింది. అక్కడి ద్వీపంలోని 90 శాతం పక్షుల్లో ప్లాస్టిక్‌ ఆనవాళ్లు ఉన్నట్టు తేల్చారు. లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు ఈ పరిస్థితికి ‘ప్లాస్టికోసిస్‌’ వ్యాధిగా నామకరణం చేశారు. వర్తమాన ప్రపంచంలో ప్లాస్టిక్‌ ద్వారా వచ్చే సమస్యకు పేరు పెట్టడం ఇదే తొలిసారి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 8 మిలియన్‌ ప్లాస్టిక్‌ ముక్కలు సముద్రాల్లోకి చేరుతున్నాయని, అందులో ఎక్కువ భాగం సముద్ర పక్షులు ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి జీర్ణవ్యవస్థను నాశనం చేసి మరణానికి దారి తీస్తున్నట్టు తేల్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిన్న పక్షులు చూడ్డానికి ఆరోగ్యంగా కనిపించినా తక్కువ కాలంలోనే జీర్ణ వ్యవస్థ పనిచేయక చనిపోతున్నట్టు నేచురల్‌ హిస్టరీ మ్యూజియం జీవశాస్త్రవేత్త అలెక్స్‌ బాండ్‌ ప్రకటించారు. 

తరుణోపాయం ఇదొక్కటే 
ప్లాస్టిక్‌ విచ్చలవిడి వినియోగం భవిష్యత్‌లో మరింత ప్రమాదకారిగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)–2022 నివేదిక ప్రకారం మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్‌ చేస్తున్నట్టు తేలింది. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన 10 బిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌లో దాదాపు 6 బిలియన్‌ టన్నులు భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నట్టు తేల్చారు.

సాధ్యమైన మేర ప్లాస్టిక్‌ను వాడకపోవడమే ఉత్తమమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కట్లర్లు, స్ట్రాలు, బెలూన్‌ స్టిక్స్, కాటన్‌ బడ్స్‌ను పూర్తిగా నిషేధించాయి. గతేడాది 175 దేశాలు 2024 నాటికి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడానికి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశంలో సైతం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించారు. అయినప్పటికీ మార్కెట్‌లో దాని వినియోగం మాత్రం తగ్గలేదు.

ప్లాస్టికోసిస్‌ అంటే..  
పక్షులు ఆహారంగా భావించి తింటున్న ప్లాస్టిక్‌ వాటి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను హరిస్తోంది. ఇది పక్షి కడుపులోని గ్రంథులను, జీర్ణ ప్రక్రియను నాశనం చేసి మరణానికి చేరువ చేస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మొత్తం ప్రక్రియకు ‘ప్లాస్టికోసిస్‌’గా పేరు పెట్టారు. హవాయి ద్వీపంలోని అల్‌బట్రాస్‌ పక్షులు కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని మరణిస్తున్నాయని, ఏటా 2.50 లక్షల అల్‌బట్రాస్‌ పక్షి పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నాయని గుర్తిం­చారు.

ఈ తరహా లక్షణాలు చాలా సముద్ర జంతువులు, జీవుల్లో కూడా కనిపించాయని పేర్కొన్నారు. ప్లాస్టికోసిస్‌ లక్షణాలు మానవుల్లోనూ కనిపించాయని, ఇటీవల ఆ్రస్టేలియాలో 52 మంది ప్రేగుల్లో మైక్రోప్లాస్టిక్‌ కణాలను గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆకలి మందగించడంతో పాటు ఇతర పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించి మరణానికి దారితీయవచ్చని చెబుతున్నారు. 

1,200కు పైగా జీవుల ఉనికి ప్రశ్నార్థకం
లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజి­యం నుంచి వెళ్లిన శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రేలియాకు 600 మైళ్ల దూరంలోని లార్డ్‌హోవ్‌ ద్వీపంలో పక్షుల మరణాలపై అధ్యయనం చేపట్టింది. అక్కడ డజన్లకొద్దీ చనిపోయి పడి ఉన్న బ్రౌన్‌ సీగల్స్‌ పక్షుల కళేబరాలను ల్యాబ్‌లో పరీక్షించి ఒక్కో పక్షి కడుపులో దాదాపు 200కు పైగా ప్లాస్టిక్‌ ముక్కలను వెలికితీశారు.

ఈ తరహా ప్లాస్టిక్‌ ముక్కలు కేవలం సముద్ర పక్షులనే కాకుండా దాదాపు 1200కు పైగా సముద్ర జీవుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి 5 మి.మీ. కంటే చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ ముక్కలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు రెండేళ్ల క్రితం ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. కానీ.. బయట వాతావరణంలో ఇలాంటి జబ్బును లార్డ్‌ హోవ్‌ ద్వీపంలోనే మొదటిసారి గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది.

పైగా.. జీవించి ఉన్న చాలా పక్షులు బరువు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వాస్తవానికి 2010లోనే ఈ పక్షులు తక్కువ బరువు ఉన్నట్టు గుర్తించినా కారణాలను మాత్రం అంచనా వేయలేకపోయారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిశోధనల ప్రకారం వాటి కడుపులోని ప్లాస్టిక్‌ ముక్కలు జీర్ణం కాకపోవడం వల్లనే అవి ఆహారం తీసుకోవడం లేదని, ఫలితంగా రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నట్టు గుర్తించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top