300 ఏళ్లలో 200 కోట్లకు!

Fertility rates around the world are declining rapidly - Sakshi

మరింత తగ్గినా తగ్గొచ్చంటున్న అధ్యయనం

పునరుత్పత్తి రేటు పడిపోతుండటమే కారణం

భారత్‌తో సహా అన్ని దేశాల్లోనూ అదే ధోరణి

జన విస్ఫోటనంతో ప్రపంచమంతా అల్లాడుతోంది. గతేడాది ఈ సమయానికే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. అదే ఊపులో మరో 30 నుంచి 50 ఏళ్లలోపే ఏకంగా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఆ తర్వాత? అలా పెరుగుతూనే పోతుందా? పెరగకపోగా, బాగా తగ్గుముఖం పడుతుందట.

ఎంతగా అంటే, ఓ 300 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా మొత్తం కలిపి 200 కోట్లకు పరిమితమైపోతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది! ఇంకా మాట్లాడితే అంతకంటే భారీగా తగ్గినా ఆశ్చర్యం లేదంటోంది. కారణమేమిటో తెలుసా? ప్రాకృతిక విపత్తులనుకుంటున్నారా? కాదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు శరవేగంగా తగ్గిపోతుండటమే! ఈ జాబితాలోని దేశాల్లో భారత్‌ కూడా ముందు వరుసలో ఉండటం విశేషం...

గత 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ వచి్చంది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటూ ఇటుగా ఉన్నది కాస్తా ఈ 70 ఏళ్లలో ఏకంగా మూడింతలైందన్నది ఐరాస అంచనా! మరి మున్ముందు జనాభా పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉండొచ్చు? ఈ ఆసక్తికర అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త డీన్‌ స్పియర్స్‌ లోతైన అధ్యయనం చేశారు.

జనాభా ఊహాతీతంగా తగ్గిపోవడం ఖాయమని తేల్చారు. ‘‘2080 నుంచే ఈ ధోరణి మొదలవుతుంది. క్రమంగా ఊపందుకుంటుంది. అలా మరో 300 ఏళ్లలోపే ప్రపంచ జనాభా 200 కోట్లకు పరిమితమైపోతుంది. ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గుతుంది’’ అని బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేటు (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌–టీఎఫ్‌ఆర్‌)లో క్రమంగా వస్తున్న నమోదవుతున్న తగ్గుదలను ఆధారంగా స్పియర్స్‌ ఈ నిర్ధారణకు వచ్చారు.

పలు దేశాల్లో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పిర్స్‌ వాదనను బలపరిచేలానే ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న ప్రపంచ జనాభా 2022లో 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లు పట్టింది. కానీ 900 కోట్లకు చేరేందుకు 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు మూడేళ్లు ఎక్కువ సమయం పట్టనుంది!
 
ఏమిటీ టీఎఫ్‌ఆర్‌...?
ప్రతి మహిళ తన పునరుత్పత్తి సామర్థ్యం ముగిసేదాకా జీవించి, ఇతరత్రా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే కనగలిగిన పిల్లల సంఖ్యే టీఎఫ్‌ఆర్‌. జనాభాలో పెరుగుదల నమోదు కావాలంటే ఇది కనీసం 2 కంటే ఎంతో కొంత ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం గ్లోబల్‌ టీఎఫ్‌ఆర్‌ 2.1గా ఉంది. 2026కల్లా ఇది 2కు తగ్గుతుందని అంచనా. అక్కణ్నుంచి స్థిరంగా తగ్గుతూ 2081 నాటికి ఏకంగా 1.4కు పడిపోనుంది.

భారత్‌ విషయమే తీసుకుంటే, 2020 నాటికి టీఎఫ్‌ఆర్‌ 2కు దిగొచ్చింది. ప్రస్తుతం 1.8కి తగ్గిందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల్లో చాలావరకు టీఆఎఫ్‌ఆర్‌ ఇప్పటికే 2 కంటే దిగువకు వచ్చేసింది. గ్లోబల్‌ టీఎఫ్‌ఆర్‌ మున్ముందు ఏ 1.5 దగ్గరో స్థిరపడుతుందని, అంతకంటే తగ్గదని భావించినా జనాభా నానాటికీ తగ్గడమే తప్ప పెరిగే ప్రసక్తే ఉండదన్నది స్పియర్స్‌ అంచనా. ఆయన అధ్యయనంలో వెల్లడైన విశేషాలు...

► ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న 29 దేశాల్లో 2022 నాటికే 20 దేశాల్లో పునరుత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) 2 కంటే తగ్గింది.
►జనాభాపరంగా పెద్ద దేశాల్లో టీఎఫ్‌ఆర్‌ 2కు పైగా ఉండేవాటి సంఖ్య 2050కల్లా 3కు తగ్గుతుంది. అవి కాంగో, నైజీరియా, టాంజానియా.
►2081 నాటికి అన్ని దేశాల్లోనూ టీఆఎఫ్‌ఆర్‌ 2 కంటే తగ్గిపోతుంది.
►జననాల విషయంలో ప్రపంచంలో అగ్ర స్థానం భారత్‌దే. దేశంలో ఏటా 2 కోట్ల జననాలు నమోదవుతున్నాయి. ఈ శతాబ్దాంతానికల్లా అది ఏకంగా నాలుగో వంతుకు, అంటే 50 ►చైనాలో 85 లక్షలుగా ఉన్న వార్షిక జననాల సంఖ్య కేవలం శతాబ్దాంతానికి 12 లక్షలకు పరిమితం కానుంది.
►ఒకసారి తగ్గుముఖం పట్టాక జనాభా మళ్లీ పెరగాలంటే గ్లోబల్‌ టీఎఫ్‌ఆర్‌ 2 కంటే పెరగాలి. కానీ అందుకు అవకాశాలు చాలా స్వల్పం. ఎందుకంటే చరిత్రలో ఇప్పటిదాకా ఏ దేశంలోనూ అలా జరగలేదు.
►ఏ దేశంలో చూసినా ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్న వారు పెరుగుతున్నారు.
►జీవన శైలి, ఆహారపుటలవాట్ల వంటి కారణాలతో పిల్లలు పుట్టని దంపతుల సంఖ్యా పెరుగుతోంది.

చాలా రాష్ట్రాల్లో తగ్గిన పునరుత్పత్తి రేటు
మన దేశంలో చూసుకుంటే 40 ఏళ్ల క్రితం కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పునరుత్పత్తి రేటు కనీసం 3 నుంచి 5 దాకా ఉండేది. ఇప్పుడది విపరీతంగా తగ్గిపోయింది. హరియాణానే తీసుకుంటే 5 నుంచి ఏకంగా 2కు తగ్గింది! ఇప్పుడు పునరుత్పత్తి రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిహార్‌ (3), మధ్యప్రదేశ్‌ (2.6), యూపీ (2.7), రాజస్థాన్‌ (2.4), అస్సాం (2.1) మాత్రమే. పశి్చమబెంగాల్, తమిళనాడుల్లో 1.4 శాతం, మహారాష్ట్ర , పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో 1.5, కర్ణాటకలో 1.6, ఒడిశాలో టీఎఫ్‌ఆర్‌ 1.8గా ఉంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top