
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ బిల్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన మస్క్.. తన ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు.
ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్‌లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ కోసం 250 మిలియన్ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు.
అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు.

ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు
- హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.
- ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.
- ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది.
- అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది.
ఈ బిల్లులో..
- సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి.
- అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.
- అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది.