
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లతో చిర్రెత్తిపోయిన ట్రంప్
అక్కసుతో భారత్‌పై మరోసారి దిగుమతి సుంకాలు పెంచుతానని ప్రకటన
ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన భారత్
అమెరికా, యురోపియన్ యూనియన్ కక్షగట్టాయన్న కేంద్ర ప్రభుత్వం
న్యూయార్క్/వాషింగ్టన్/ న్యూఢిల్లీ: భారతీయ సరకులపై కొత్తగా 25 శాతం దిగుమతి సుంకాల మోత మొదలై వారమన్నా గడవకముందే ట్రంప్ తన తెంపరితనాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య బెదిరింపులకు చిరునామాగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్‌పై తన ఆగ్రహజ్వాలలను టారిఫ్‌ల రూపంలో వెళ్లగక్కనున్నారు.
చమురును రష్యా నుంచి భారత్ విపరీతంగా కొనుగోళ్లు చేస్తుండటంతో రష్యాకు లాభాల పంట పండుతోందని, ఇందుకు భారతే ప్రధాన కారణమని ట్రంప్ మరోమారు ఆరోపించారు. రష్యా లాభాలకు కారణమవుతున్న భారత్‌పై మళ్లీ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌చేశారు. భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు ఐదు రోజుల క్రితమే అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే.
‘‘రష్యా నుంచి భారత్ విపరీతంగా భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది. సొంత అవసరాల కోసం మాత్రమే కాదు ఇతర దేశాలకు తిరిగి రీసేల్ చేసేందుకూ రష్యా నుంచి ఆయిల్‌ను కొంటోంది. ఇలా కొన్న ఆయిల్‌ను అక్రమంగా ఓపెన్‌మార్కెట్ పద్ధతిలో విదేశాలకు అమ్ముకుని లాభాలు గడిస్తోంది. భారత్ తన లాభాలను చూసుకుంటోందిగానీ రష్యా ఏ స్థాయిలో లాభాల పంట పండిస్తోందో భారత్ పట్టించుకోవట్లేదు.
భారత్‌కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్‌కు ఇవేం పట్టవు. అందుకే భారత్‌పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్ ప్రకటించారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి పూర్వం భారత చమురు దిగుమతుల్లో రష్యావాటా కేవలం 0.2 శాతం కాగా ఆతర్వాతి రోజుల్లో అది 35 నుంచి 40 శాతానికి ఎగబాకడం విశేషం. ఈ నేపథ్యంలోనే రష్యా, భారత్ చమురు వాణిజ్య బంధాన్ని తెంపేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారు. జూలైలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 36 శాతంగా ఉండటం గమనార్హం.
తీవ్రంగా ప్రతిస్పందించిన భారత్
మరోమారు దిగుమతి టారిఫ్‌ల మోత మోగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు.
అయినాసరే ఉక్రెయిన్ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్‌కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం.
భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది.
అమెరికా తమ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్‌ను, విద్యుత్‌వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్ యూనియన్ ఏకంగా 67.5 బిలియన్ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్ తెగేసి చెప్పింది.