breaking news
India and Russia
-
మళ్లీ సుంకాలు పెంచుతా!: ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్/ న్యూఢిల్లీ: భారతీయ సరకులపై కొత్తగా 25 శాతం దిగుమతి సుంకాల మోత మొదలై వారమన్నా గడవకముందే ట్రంప్ తన తెంపరితనాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య బెదిరింపులకు చిరునామాగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్‌పై తన ఆగ్రహజ్వాలలను టారిఫ్‌ల రూపంలో వెళ్లగక్కనున్నారు. చమురును రష్యా నుంచి భారత్ విపరీతంగా కొనుగోళ్లు చేస్తుండటంతో రష్యాకు లాభాల పంట పండుతోందని, ఇందుకు భారతే ప్రధాన కారణమని ట్రంప్ మరోమారు ఆరోపించారు. రష్యా లాభాలకు కారణమవుతున్న భారత్‌పై మళ్లీ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌చేశారు. భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు ఐదు రోజుల క్రితమే అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ‘‘రష్యా నుంచి భారత్ విపరీతంగా భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది. సొంత అవసరాల కోసం మాత్రమే కాదు ఇతర దేశాలకు తిరిగి రీసేల్ చేసేందుకూ రష్యా నుంచి ఆయిల్‌ను కొంటోంది. ఇలా కొన్న ఆయిల్‌ను అక్రమంగా ఓపెన్‌మార్కెట్ పద్ధతిలో విదేశాలకు అమ్ముకుని లాభాలు గడిస్తోంది. భారత్ తన లాభాలను చూసుకుంటోందిగానీ రష్యా ఏ స్థాయిలో లాభాల పంట పండిస్తోందో భారత్ పట్టించుకోవట్లేదు. భారత్‌కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్‌కు ఇవేం పట్టవు. అందుకే భారత్‌పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి పూర్వం భారత చమురు దిగుమతుల్లో రష్యావాటా కేవలం 0.2 శాతం కాగా ఆతర్వాతి రోజుల్లో అది 35 నుంచి 40 శాతానికి ఎగబాకడం విశేషం. ఈ నేపథ్యంలోనే రష్యా, భారత్ చమురు వాణిజ్య బంధాన్ని తెంపేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారు. జూలైలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 36 శాతంగా ఉండటం గమనార్హం. తీవ్రంగా ప్రతిస్పందించిన భారత్ మరోమారు దిగుమతి టారిఫ్‌ల మోత మోగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే ఉక్రెయిన్ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్‌కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం. భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది. అమెరికా తమ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్‌ను, విద్యుత్వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్ యూనియన్ ఏకంగా 67.5 బిలియన్ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్ తెగేసి చెప్పింది. -
ఉగ్రపోరులో ‘సహజ’ భాగస్వామ్యం
భారత్–రష్యా సంబంధాలపై మోదీ సెయింట్ పీటర్స్బర్గ్: ఉగ్రవాదంపై పోరులో భారత్–రష్యాలు సహజ భాగస్వాములని ప్రధాని మోదీ తెలిపారు. రష్యా పర్యటన సందర్భంగా ఆ దేశ పత్రిక ‘రోసీయిస్కాయా గజెటా’లో మోదీ వ్యాసం రాశారు. ‘అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల నేపథ్యంలోనూ 1947 నుంచి భారత్–రష్యా మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లోనూ, సుఖదుఃఖాల్లోనూ మేం కలిసే ఉన్నాం. సమానత్వం, విశ్వాసం, పరస్పర ప్రయోజన సిద్ధాంతాల ఆధారంగానే మా దృఢమైన బంధుత్వం కొనసాగుతోంది’ అని మోదీ వ్యాసంలో పేర్కొన్నారు. భారత పారిశ్రామికాభివృద్ధిలో అప్పటి సోవియట్ యూనియన్ చేసిన సాయం మరువలేనిదని ప్రధాని ప్రశంసించారు. మిలటరీ సాంకేతికత రంగంలో సహకారం భారత–రష్యా బంధాలకు బలమైన పునాది. రష్యన్ పరికరాలు, సాంకేతికతే మా భద్రతా విభాగంలో కీలకం. ప్రస్తుతం సాఖాలిన్ 1, వాంకోర్, తాస్–యుర్యాఖ్ చమురు క్షేత్రాల్లో భారత పెట్టుబడులు, సాంకేతిత.. కూడంకుళం అణువిద్యుత్ ప్లాంటు, బ్రహ్మోస్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో భాగస్వామ్యం మా దోస్తీకి నిదర్శనం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
బంధం బలోపేతం
భారత్-రష్యా మధ్య 20 కీలక ఒప్పందాలు న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య బంధం మరింత బలోపేతమైంది. కీలక రంగాల్లో మరింత లోతుగా సహకరించుకోవాలని, దశాబ్దంలోగా ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరో 20 ఏళ్లలో భారత్‌లో కనీసం 12 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రష్యా అంగీకరించింది. అలాగే భారత్ కోసం అత్యాధునిక హెలికాప్టర్లను కూడా తయారు చేసివ్వనుంది. రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతమయ్యేలా 20 ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన వార్షిక సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో అణు ఇంధన సహకారంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ప్రస్తుతమున్నకుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి తోడు రష్యా సహకారంతో మరో కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు స్థల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ నిర్ణయించింది. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత శక్తికి రష్యా మూలస్తంభం వంటిదని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత వ్యూహాత్మక భాగస్వామిగా రష్యా పాత్ర మరింత పెరుగుతుందని ప్రధాని తెలిపారు. ‘కొత్త రక్షణ ప్రాజెక్టుల విషయంలో మేం విస్తృతంగా చర్చించాం. మేక్ ఇన్ ఇండియా వంటి దేశ ప్రాధాన్యాంశాలకు తోడ్పడే విధంగా రక్షణ సంబంధాలను కొనసాగించడంపై దృష్టి సారించాం. తన వద్దనున్న అత్యాధునిక హెలికాప్టర్‌ను ఇకపై పూర్తిగా భారత్‌లోనే తయారుచేసేందుకు రష్యా అంగీకరించింది. దీన్ని భారత్ ఎగుమతి కూడా చేయొచ్చు. ఇతర రక్షణ రంగ పరికరాలను భారత్‌లో తయారు చేసేందుకు రష్యా సుముఖంగా ఉంది’ అని మోదీ వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అణు రియాక్టర్ల నిర్మాణంపై కూడా దృష్టిసారించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పరికరాలు, విడి భాగాల తయారీ కూడా భారత్‌లోనే జరుగుతుందని మోదీ పేర్కొన్నారు. అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని అణు సహకారంపై సంయుక్తంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నట్లు తెలిపారు. చమురు, సహజవాయువు రంగాల్లోనూ పరస్పరం సహకరించుకునేలా ఎజెండాను రూపొందించుకోనున్నట్లు చెప్పారు. ఇరు దేశాల కరెన్సీలతోనే వాణిజ్యం ఆర్థిక రంగంలో మరింత సహకారానికి కృషి చేయాలని, వాణిజ్య చెల్లింపులను ఇరుదేశాల కరెన్సీలోనే జరుపుకొనేలా ప్రోత్సహించాలని భారత్-రష్యా అంగీకారానికి వచ్చాయి. ఇందుకోసం ఎదురయ్యే అడ్డంకులు, సమస్యల పరిష్కారానికి సిఫారసులు చేసేందుకుగాను ఓ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి. ఇంధన రంగంతో పాటు పెట్రో కెమికల్స్లోనూ సంయుక్త ప్రాజెక్టులను చేపట్టాలని, టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టుల విషయంలో సంయుక్తంగా డిజైన్, అభివృద్ధి, తయారీని చేపట్టాలని నిర్ణయించాయి. అంతరిక్షం, వైమానిక రంగం, ఖనిజాభివృద్ధి తదితర రంగాలకూ దీన్ని విస్తరించాలని అంగీకారానికి వచ్చాయి. ఎరువులు, వజ్రాల వ్యాపారం, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. ఉగ్రవాదానికి తావు లేకుండా చేస్తాం జమ్మూతోపాటు చెచెన్యాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారికి భారత్-రష్యా సంతాపం ప్రకటించాయి. ఈమేరకు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉపఖండంలోని ఉగ్రవాద స్థావరాలను దశాబ్దంలోగా నామరూపాల్లేకుండా చేస్తామని అందులో పేర్కొన్నాయి. పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని అరికట్టడానికి దేశాల మధ్య మరింత సహకారం అవసరమని అభిప్రాయపడ్డాయి. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి. ఒప్పందాలు ఇవే.. హైడ్రోకార్బన్ల ఉత్పత్తిలో సంయుక్త పరిశోధన, రష్యా నుంచి భారత్‌కు హైడ్రోకార్బన్ల సరఫరా కోసం పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం, దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా, పదేళ్ల పాటు ముడిచమురు సరఫరా, రష్యాలో పెట్టుబడులకు అవకాశాలను సంయుక్తంగా గుర్తించడం, రష్యా ఎరువుల కంపెనీ ‘ఆక్రాన్’ను దాదాపు రూ. 12 వేల కోట్లకు భారత కంపెనీల కన్సార్షియం చేపట్టడం, కుడంకుళం అణు కేంద్రంలో మూడు, నాలుగో యూనిట్‌ను నెలకొల్పడం వంటి ఒప్పందాలను ఇరుదేశాలకు సంబంధించిన సంస్థలు తాజా వార్షిక సదస్సు సందర్భంగా కుదుర్చుకున్నాయి. అలాగే వార్తల పరస్పర మార్పిడికి వీలుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీతో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వీసా నిబంధనల సరళీకరణకు కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.