
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయనున్న ట్రంప్
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష ఆంగ్లం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవహారాల్లో ఉపయోగించే భాష ఆంగ్లమే. దేశంలో ఇతర భాషలు సైతం మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ భాషకూ అధికార భాష హోదా లేదు.
ఇంగ్లిష్‌కు ఇప్పుడు ఆ హోదా కల్పించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకల్పించారు. ఇంగ్లిష్‌ను దేశమంతటా అధికార భాషగా గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలియ జేశాయి. అయితే, ఎప్పుడు సంతకం చేస్తారన్నది బయటపెట్టలేదు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంగ్లాన్ని అధికార భాషగా గుర్తించాయి.