ఐ యామ్‌ ఫీలింగ్‌ గ్రేట్‌: డొనాల్డ్‌ ట్రంప్‌

Donald trump First Event After Covid Diagnosis - Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిది రోజుల తర్వాత శనివారం రాత్రి ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో వందల సంఖ్యలో ట్రంప్‌ మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ బాల్కనీ నుంచి ప్రసంగిస్తూ.. 'నేను ఈ సమయాన్ని గొప్పగా భావిస్తున్నాను (ఐ యామ్‌ ఫీలింగ్‌ గ్రేట్‌). నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బయటకు వెళ్లి ఓటు వేయండి' అంటూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు. కాగా ర్యాలీకి హాజరైన ట్రంప్‌ మద్దతుదారులు 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అని రాసిన టోపీలను ధరించి హాజరయ్యారు.  (రెండో డిబేట్‌ రద్దు)

కాగా.. వైట్‌హౌస్‌ వైద్యులు ట్రంప్‌ ఆరోగ్యంపై ప్రకటన చేస్తూ వైట్ హౌస్ చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనలో వ్యాధి లక్షణాలు కనిపించలేదు. చికిత్సకు బాగా స్పందించారని వైట్ హౌస్ డాక్టర్ సియాన్‌‌ కాన్లే తెలిపారు. ఇచ్చిన మందుల వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు. 

ఇక సోమవారం ట్రంప్ సెంట్రల్ ఫ్లోరిడాలో క్యాంపెయిన్ చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా అవుట్ డోర్‌లో జరుగుతుందా లేదా ఇండోర్‌లోనా అనే విషయం తెలియాల్సి ఉంది.  మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో రెండో అధ్యక్ష ఎన్నికల డిబేట్‌కు ట్రంప్ 'నో' చెప్పారు. దీంతో అక్టోబర్ 15న జరగాల్సిన ఈ డిబేట్ రద్దయింది. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో చివరిదైన మూడో డిబేట్ అక్టోబర్ 22న జరగనుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top