ఇరాన్‌పై భీకర దాడులు తప్పవని ట్రంప్ సంకేతాలు
వాషింగ్టన్: ఇరాన్‌ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి.
కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్‌కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్‌చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకి
పశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది.
ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది.


