నిరాశ చెందవద్దు.. ప్రయాణం ఇప్పుడే మొదలైంది: ట్రంప్‌

Donald Trump Condemns Capitol Violence Video Message - Sakshi

క్యాపిటల్‌ భవనంపై దాడిని ఖండించిన ట్రంప్‌

ఈనెల 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది

శాంతి సందేశం విడుదల చేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై జరిగిన దాడిని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. హింసకు పాల్పడే వారు అసలు ఈ దేశ ప్రజలే కాదు అంటూ మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని చుట్టిముట్టిన క్రమంలో వాషింగ్టన్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని ఈ ఘటన అగ్రరాజ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది. దీంతో తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్‌ తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సొంతపార్టీ నేతలు సైతం, ముఖ్యంగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ట్రంప్‌ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గడువుకు ముందే ఆయనను గద్దె దింపే మార్గాల అన్వేషణ ఆరంభించారు.

జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది
ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌ గురువారం రాత్రి ట్విటర్‌లో శాంతి మంత్రం వల్లిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా కాంగ్రెస్‌ జో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించిందని, క్రమపద్ధతిలో సామరస్య పూర్వకంగా అధికార మార్పిడి చేయడం మీదే తాను దృష్టి సారించినట్లు వెల్లడించారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందంటూ తన ఓటమిని అంగీకరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాను అన్ని విధాలుగా ప్రయత్నించానని, అమెరికా ఎన్నికల ఫలితానికి సంబంధించి ప్రజల్లో పూర్తి విశ్వాసం నెలకొనేలా ఎన్నికల చట్టాల్లో పలు మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తన ఓటమి గురించి ఎవరూ బాధపడవద్దని, మన ప్రయాణం ఇప్పుడే మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు.(చదవండి: వాషింగ్టన్‌లో ఉద్రిక్తత: ట్రంప్‌కు షాక్‌..!)

అందరికీ ధన్యవాదాలు
అదే విధంగా... 2020 ఎంతో మందికి చేదు అనుభవాలు మిగిల్చిందని, కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ట్రంప్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అనేక చర్యలు తీసుకున్నామన్నారు. కష్టకాలంలో దేశం మొత్తం ఒక కుటుంబంలా కలిసి ఉండి సవాళ్లను ఎదుర్కొందని హర్షం వ్యక్తం చేశారు. ఇకపై కూడా ఇదే ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు సేవ చేయడం జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప గౌరవమని, తమ మద్దతుదారులు, అమెరికా పౌరులకు ట్రంప్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: అమెరికాలో అరాచకం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top